మల్హర్(కాటారం): ఈనెల 20న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో కలిసి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం పర్యటన అనంతరం కాటారం మండలం నస్తురుపల్లిలో రైతు భరోసా రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అధికారులు విధులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. నస్తూరుపల్లి బహిరంగ సభకు విచ్చేసే ప్రజలకు తాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేయాలన్నారు. బహిరంగ సభా స్థలి వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేయాలని డీపీఓకు సూచించారు. విద్యుత్, ఆర్‌అండ్‌బీ, పీఆర్ ఇంజనీరింగ్, వైద్యారోగ్యశాఖ అధికారులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నెల 19, 20 తేదీలలో ఇసుక లారీలకు అనుమతి ఇవ్వొద్దని, మూసివేయాలని ఆయన తెలిపారు. విధులు నిర్వహించే సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని కలెక్టరేట్ ఏఓకు సూచించారు. అంతకుముందు కాళేశ్వరం, నస్తూరుపల్లిలో సీఎం పర్యటన హెలి ప్యాడ్ పనులను పరిశీలించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికష్ణ, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


