వేతన భారం! | - | Sakshi
Sakshi News home page

వేతన భారం!

Apr 16 2026 10:36 AM | Updated on Apr 16 2026 10:36 AM

జీఓ రద్దు చేయాలి గతంలోనూ ఇదే పద్ధతి

జీపీ నిధులనుంచే పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు

భూపాలపల్లి రూరల్‌: నిధుల కొరతతో గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం మరోభారం మోపింది. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను ఇక నుంచి పంచాయతీ నిధుల నుంచే చెల్లించాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల వేతనాలను కూడా చెల్లించారు. ఈ నిర్ణయంపై పంచాయతీ పాలకవర్గాలు కలవరపడుతున్నాయి. నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పంచాయతీలకు వేతనభారం కానుంది. పాత పద్ధతిలోనే ప్రభుత్వమే నేరుగా తమ ఖాతాల్లో వేతనాలు జమ చేయాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. పంచాయతీ కార్మికుల వేతనాలను 15వ ఆర్థిక సంఘం నిధులు, జనరల్‌ ఫండ్‌ లేదా ఇతర అంతర్గత వనరుల నుంచే చెల్లించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో మంజూరు కావడంలేదు. కేంద్ర ప్రభుత్వం మూడు నెలలకు మేజర్‌ పంచాయతీలకు సుమారు రూ.3 లక్షల వరకు నిధులు విడుదల చేస్తోంది. ఈ నిధులతోనే పారిశుద్ధ్య పనులు, వేతనాలు చూసుకోవాలని స్పష్టం చేసింది.

పంచాయతీలకు కష్టకాలం..

జిల్లాలో 248 గ్రామ పంచాయతీలు ఉండగా, 1,026 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరినీ మల్టీపర్పస్‌ వర్కర్లుగా పరిగణిస్తూ నెలకు రూ.9,500 చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. గతంలో ఈ వేతనాల కోసం ప్రత్యేక నిధులు విడుదలయ్యేవి. పంచాయతీ అభివృద్ధి నిధులతో సంబంధం లేకుండా కార్మికులకు కనీసం మూడు నెలలకొకసారి జీతాలు చెల్లించేవారు. ప్రసుత్తం వేతనాలకు పంచాయతీ నిధులకు ముడి పెట్టడంతో కా ర్మికుల్లో ఆందోళన మొదలైంది. గ్రామాల్లో వీధి దీపాలు, బోరు మోటార్ల మరమ్మతు విద్యుత్‌ బిల్లుల భారం కూడా పంచాయతీలపైనే పడుతోంది. విద్యుత్‌ చార్జీలు, వర్కర్ల వేతనాలు చెల్లించగా మిగిలిన నిధులను మాత్రమే అత్యవసర పనులకు వాడుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే నిధులు లేక సర్పంచులు, కార్యదర్శులు సతమతమవుతున్నారు. ఈ అదనపు భారం మోయడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2025 నుంచి గ్రీన్‌ చానల్‌ ద్వారా వేతనాలు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు. చేతులెత్తేయడంపై విమర్శలు వస్తున్నాయి.

మాజీ సర్పంచుల ఒత్తిడి..

చేసిన పనుల బిల్లులు, బకాయిల కోసం మాజీ సర్పంచులు కొత్త పాలకవర్గాలపై ఒత్తిడి తెస్తున్నారు. గతంలో చేసిన పనులకు సంబంధించి ఎంబీ రికార్డులు చేయించినా బిల్లులు రాలేదని వాపోతున్నారు. కొందరు వాస్తవంగా పనులు చేసినా మరికొందరు అక్రమంగా బిల్లులు సృష్టించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఉన్న నిధులను వేతనాలు, కరెంటు బిల్లులకే కేటాయించమనడంతో పాత బకాయిలు ఎలా చెల్లించాలో తెలియక కొత్త పాలకవర్గాలు తలలు పట్టుకుంటున్నాయి.

పారిశుద్ధ్య కార్మికులకు గ్రీన్‌ చానెల్‌ ద్వారా వేతనాలు ఇస్తామని ప్రకటించి, ఇప్పుడు పంచాయతీలే చెల్లించుకోవాలని చెబుతున్నారు. వెంటనే జీఓ నంబర్‌ 51 రద్దు చేయాలి. విద్యార్హతల ప్రకారం కారోబార్లకు కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించాలి. ప్రత్యేక నిధులు కేటాయించి పాత పద్ధతిలోనే వేతనాలు అందించాలి.

– బంటు సుదర్శన్‌, కారోబార్‌ పంబాపూర్‌

గతంలోనూ ఇదే పద్ధతిలో పంచాయతీల నుంచే పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించాం. అయితే రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో ప్రభుత్వం చెల్లించింది. ప్రస్తుతం పాలకవర్గాలు కొలువుదీరడంతో జనవరి నుంచి పంచాయతీలు వేతనాలు చెల్లిస్తున్నాయి.

– శ్రీలత, డీపీఓ

కేంద్ర, రాష్ట్ర నిధులు

వినియోగించుకునేందుకు అవకాశం

ప్రభుత్వమే నేరుగా చెల్లించాలని విన్నపం

జిల్లాలో 248 జీపీలు,

1,026 పారిశుద్ధ్య కార్మికులు

Advertisement
 
Advertisement
Advertisement