భూపాలపల్లి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో రేపు జమ కానున్నాయి. యాసంగి సీజన్ ప్రారంభం నుంచి పెట్టుబడి సహాయం కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 22నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలోని రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
రైతులకు ఉపశమనం..
యాసంగి సీజన్ ప్రారంభమై సుమారు మూడు నెలలు కావస్తుంది. జిల్లాలోని 1,08,418 మంది రైతులు ఈ సీజన్‌లో వరి, మొక్కజొన్న, అరటి, కూరగాయలు తదితర పంటలను సాగుచేశారు. సరిగ్గా పెట్టుబడి సమయంలో రైతు భరోసా అందలేదు. దీంతో రైతులంతా స్థానిక అడ్తీ, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. ప్రస్తుతం పంటలు చేతికొచ్చే దశలో ఉండగా, ఇప్పటికీ మొక్కజొన్న, అరటి, కూరగాయలు లాంటి పంటలు సాగుచేస్తున్న రైతులు ఇంకా ఎరువులు, క్రిమిసంహారక మందులకు డబ్బులు వెచ్చించాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలోనే ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేయనుండటంతో రైతులకు కొంతమేరకు ఉపశమనం కలగనుంది.
ప్రతీ ఒక్కరికి ఎకరాకు..
గతంలో ఎకరం వరకు ఉన్న రైతులకు తొలుత, తరువాత రెండెకరాలు.. ఇలా పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం అందించేది. ఈసారి ఎన్ని ఎకరాలు ఉన్నా.. తొలుత ఒక ఎకరానికి, తరువాత రెండు ఎకరాలకు.. ఇలా విస్తీర్ణం ఆధారంగా దఫాల వారీగా పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది. ఫలితంగా జిల్లాలోని 1,08,418 రైతులకు తొలిరోజు అనగా రేపు(ఆదివారం) ఒక ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతు భరోసా సహాయం అందనుంది.
మండలం రైతుల జమకావాల్సిన
సంఖ్య డబ్బులు(రూ. కోట్లలో)
భూపాలపల్లి 14,128 రూ. 16.12
చిట్యాల 13,068 రూ. 15.80
మొగుళ్లపల్లి 12,093 రూ. 13.16
రేగొండ 12,353 రూ. 12.31
టేకుమట్ల 10,949 రూ. 11.04
గణపురం 8,433 రూ. 7.30
కొత్తపల్లిగోరి 7,251 రూ. 6.58
మహాముత్తారం 7,987 రూ. 7.38
కాటారం 8,566 రూ. 6.93
మల్హర్ 6,924 రూ. 5.88
మహదేవపూర్ 5,080 రూ. 4.08
పలిమెల 1,586 రూ. 1.38
రైతుల ఖాతాల్లో జమ కానున్న డబ్బులు
తొలుత ప్రతీ రైతుకు ఒక ఎకరాకు..
జిల్లాలో 1,08,418 మంది లబ్ధిదారులు


