జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్‌కుమార్
మల్హర్(కాటారం): రైతులకు తక్కువ కాలంలో ఆదాయం అందించే ముఖ్యమైన పంటగా కూరగాయల సాగు నిలుస్తుందని, సరైన ప్రణాళికతో సాగుచేస్తే అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్‌కుమార్ అన్నారు. శుక్రవారం కాటారం మండలం గంగారం గ్రామంలో సునీల్ ఆధ్వర్యంలో ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజన్‌కు అనుగుణంగా సరైన రకాలు ఎంపిక చేసుకోవడం, నాణ్యమైన విత్తనాల వినియోగం, సమతుల్య ఎరువుల వినియోగం, తగినంత నీటి నిర్వహణ, మల్చింగ్ విధానం వంటి ఆధునిక పద్ధతులను అనుసరించడం ద్వారా దిగుబడి, నాణ్యత పెరుగుతుందని చెప్పారు. ఇంటి వద్ద చిన్న స్థాయిలో కూరగాయల తోటలు (కిచన్‌గార్డెన్) ఏర్పాటు చేసుకోవడం ద్వారా కుటుంబానికి పోషకాహారం అందడమే కాకుండా అదనపు ఆదాయం కూడా పొందవచ్చని సూచించారు. గంగారం గ్రామంలో దాదాపు ప్రతి కుటుంబం కూరగాయల సాగుపై ఆధారపడి జీవనోపాధి పొందుతుందని చెప్పారు. కూరగాయల పంటలలో కనిపించే ముఖ్యమైన చీడపీడలు, వ్యాధులను సమయానికి గుర్తించి సమగ్ర కీటక నియంత్రణ (ఐపీఎం) పద్ధతులను అనుసరించడం ద్వారా ఖర్చు తగ్గించి మంచి దిగుబడులు సాధించవచ్చని రైతులకు వివరించారు. అనంతరం పందిరి నిర్మాణం చేపట్టిన రైతులకు అందించే ప్రోత్సాహకాలు, ఉద్యాన శాఖ ద్వారా అందిస్తున్న ఉచిత కూరగాయల మినీ కిట్లను సర్పంచ్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వ్యవసాయ విస్తరణ అధికారి, ఉద్యా న విస్తరణాధికారి రాందాస్, రైతులు పాల్గొన్నారు.
మంగపేట: మండలంలోని శ్రీహేమాచల లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ ప్రాంగణంలో ఆల య కార్యనిర్వాహణ అధికారి రేవెల్లి మహేష్ ఆధ్వర్యంలో శుక్రవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మందరగిరి వేంకటేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి శ్రీనివాస్ పర్యవేక్షణలో స్వామివారి ప్రధాన ఆలయం, ఇతర ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన 9 హుండీల్లో స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను కల్యాణ మండపంలో లెక్కించారు. డిసెంబర్ 3 నుంచి ఈనెల 19వ తేదీ వరకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.12,59,594ల ఆదాయం వచ్చినట్లు ఈఓ మహేష్ తెలిపారు. హుండీ లెక్కింపు సందర్భంగా ఎస్సై టీవీఆర్ సూరీ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆలయ పూజారులు శ్రీవారి సేవాసమితి బృందం, భక్తులు పాల్గొన్నారు.


