భూపాలపల్లి అర్బన్: సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ఉచిత ఆయుర్వేద వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి శ్యాంసుందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని కృష్ణాకాలనీ సీఈఆర్ క్లబ్‌లో ఏర్పాటు చేసే వైద్య శిబిరానికి ఆయుర్వేద స్పెషలిస్టు డాక్టర్ విశ్వనాధ మహర్షి హాజరుకానున్నట్లు తెలిపారు. చర్మవ్యాధులు, మోకాళ్ల నొప్పులు, గుండెదడ, బీపీ, ఘగర్, థైరాయిడ్, మలబద్ధకం, అజీర్ణం, పక్షవాతం, ఆస్తమా, సీ్త్రలకు సంబంధించిన వ్యాధుల నివారణ కోసం వైద్య శిబిరం ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఉంటుందని తెలిపారు.
మల్హర్/మల్హర్(కాటారం): మండలంలోని కాటారం గ్రామానికి చెందిన విద్యారంగం, సామాజిక సేవలో నాలుగు దశాబ్దాలుగా విశిష్టసేవలు అందిస్తున్న ప్రముఖ విద్యావేత్త జనగామ కరుణాకర్‌రావుకు రాష్ట్రస్థాయి ఉగాది ఉత్తమ సేవారత్న పురస్కారం లభించింది. గురువారం జిల్లాకేంద్రంలోని ఇల్లందు క్లబ్‌లో నిర్వహించిన ఉగాది పురస్కారాల కార్యక్రమంలో కరుణాకర్‌రావు రాష్ట్ర స్థాయి సేవారత్న పురష్కరాన్ని అందుకున్నారు. మల్హర్ మండలం తాడిచర్ల గ్రామానికి చెందిన సాయివాణి విద్యానికేతన్ పాఠశాల కరస్పాండెంట్ వీరమేని సంపత్‌రావుకు రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కార అవార్డు అందుకున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తదితరులు కరుణాకర్‌రావు, సంపత్‌రావులను అభినందించి, సత్కరించారు.
పోచమ్మ బోనాలు
టేకుమట్ల: మండలకేంద్రంలోని పోచమ్మతల్లి ఆలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. భక్తులు బోనాలతో మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్ల శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు.
మహాముత్తారంలో
వడగళ్ల వాన
మల్హర్(మహాముత్తారం): మండలంలోని పోలారం, కనుక్కునూరు, నిమ్మగూడెం, యత్నారం, సింగంపల్లి తదితర గ్రామాల్లో గురువారం వడగళ్ల వాన కురిసింది. తోటల్లోని మిర్చి నేలరాలింది. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసి పోయింది. తడిసిన పత్తి నల్లబారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రామప్పలో నేషనల్ డిఫెన్స్ కాలేజీ అధికారులు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని గురువారం న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీలో నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్‌పై శిక్షణ ఇచ్చే అధికారులు సచిన్ బాద్‌షా, తరుణ్‌గుప్తా, ఇవాన్ అలెగ్జాండర్, అంజన వశిష్టలు సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని వారు కొనియాడారు. వారి వెంట కోఆర్డినేటర్ సందీప్, తహసీల్దార్ గిరిబాబు, ఎస్సై చల్ల రాజు, ఏఎస్సై సాంబారావు, ఆర్‌ఐ రమేశ్, టూరిస్ట్ పోలీసులు శ్రీనివాస్, భద్రు పాల్గొన్నారు.


