గోవిందరావుపేట: బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన 18వ దక్షిణ భారత కాన్ఫరెన్స్‌లో మండల కేంద్రానికి చెందిన ప్రముఖ అర్చకుడు తిరుక్కోవల్లూరు ఉదయ భాస్కర్‌కి అర్చక రత్న అవార్డు ప్రదానం చేశారు. ఆధ్యాత్మిక సేవా రంగంలో ఆయన చేస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన పండితులు, సాహితీవేత్తలు, ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొని, అర్చక వృత్తి పరిరక్షణలో ఉదయ్ భాస్కర్ చేసిన కృషిని ప్రశంసించారు. అనంతరం ఉదయ భాస్కర్ మాట్లాడుతూ అర్చక రత్న అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని అర్చకుల స్థాయి పెంపు, వారికి అవసరమైన శిక్షణ, మద్దతు అందించాల్సి ఉందని వివరించారు.


