అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్
భూపాలపల్లి: వినియోగదారులు తమ హక్కులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ సూచించారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘సురక్షితమైన ఉత్పత్తులు–నమ్మకమైన వినియోగదారులు’ అనే నినాదంతో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నాణ్యత లేని వస్తువులు కొనుగోలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. కొనుగోలు సమయంలో బిల్లులు తప్పనిసరిగా తీసుకుని భద్రపరచాలన్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీఎస్‌ఓ కిరణ్‌కుమార్, డీఎం రాములు, డీఎంహెచ్‌ఓ మధుసూదన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సకాలంలో సరఫరా చేయాలి
ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో సీరియల్ క్రమాన్ని పాటించాలని, వినియోగదారులకు సకాలంలో సిలిండర్ సరఫరా చేయాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ సూచించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రపంచ వినియోగదారుల సమావేశంలో జిల్లాలోని అన్ని ఎల్పీజీ డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఏజెన్సీల వారీగా స్టాక్ లభ్యత, రోజువారి సరఫరా పరిస్థితి, ఆయిల్ కంపెనీలకు పంపిన ఇండెంట్లు, పెండింగ్ బుకింగ్స్ తదితర అంశాలను సమీక్షించారు. ఈ సమావేశంలో డీసీఎస్‌ఓ కిరణ్‌కుమార్, ఎల్పీజీ డీలర్లు పాల్గొన్నారు.


