రైతువేదికల వివరాలు
అస్తవ్యస్తంగా రైతువేదికలు
భూపాలపల్లి రూరల్ : లాభసాటి వ్యవసాయం, చీడపీడల నివారణ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించే దిశగా వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు ప్రభుత్వం రైతువేదికలు నిర్మించింది. కొన్ని నెలలుగా నిధులు మంజూరు నిలిచిపోవడంతో వీటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆగస్టు 2022 వరకు నిర్వహణ నిధులు మంజూరు చేయగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిలిచిపోయాయి.
జిల్లాలో 45 రైతువేదికలు
గత ప్రభుత్వం 2020లో ప్రతీ వ్యవసాయ క్లస్టర్‌కు ఓ రైతు వేదిక నిర్మించింది. ప్రతీ 5వేల మంది కర్షకులకు రెండు నుంచి నాలుగు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారు. ఒక్కో దానికి వ్యవసాయశాఖ ద్వారా రూ.12 లక్షలు, ఉపాధిహామీ పథకం కింద రూ.10లక్షలు వెచ్చించారు. జిల్లాలో 45 రైతువేదికలు నిర్మించగా నిర్వహణ కోసం నెలకు రూ.3వేల చొప్పున మంజూరు చేస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పింది. ఆ నిధులు చాలవని వ్యవసాయశాఖ నివేదించడంతో రూ.9వేల చొప్పున విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత 2022 నవంబర్‌లో ఐదు నెలలకు సంబంధించి ఒక్కో వేదికకు రూ.45 వేల చొప్పున విడుదల చేసింది. ఇక అప్పటి నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి. సుమారుగా 40 నెలలుగా నిధులు మంజూరు కాకపోవడంతో ఒక్కో రైతు వేదికకు ఇప్పటివరకు రూ.3.60లక్షల నిధులు రావాల్సి ఉంది. అంటే జిల్లాలోని 45 రైతువేదికలకు నిర్వహణ నిధుల కింద రూ.కోటి 62లక్షల వరకు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. అయినప్పటికీ రైతువేదికల నిర్వహణ తప్పనిసరి కావడంతో ఏఈఓలు సొంతంగా వెచ్చిస్తూ అప్పుల పాలవుతున్నారు.
క్షేత్రస్థాయిలో సేవలందించేందుకు..
జిల్లాలోని 12 మండలాల్లో 45 క్లస్టర్లలో రైతువేదికలు నిర్మించి ఏఈఓలకు విధులు అప్పగించారు. వీటి నిర్వహణకు అప్పటి ప్రభుత్వం ప్రతినెలా ఒక్కో రైతువేదికకు రూ.9వేలు మంజూరు చేసి నిర్వహణ కొనసాగించింది. ఈ నిధులతో రైతువేదికల్లో తాగునీటి కోసం రూ.500, పారిశుద్ధ్య నిర్వహణకు రూ.3వేలు, స్టేషనరీ కోసం రూ.వెయ్యి, కరెంట్ బిల్లు కోసం రూ.వెయ్యి, మరమ్మతుల కోసం రూ.వెయ్యి, నెలలో ఎనిమిదిసార్లు రైతులతో సమావేశాలు నిర్వహించనుండగా టీ, స్నాక్స్ కోసం రూ.2,500 ఖర్చు చేయాల్సి ఉంది.
కొన్ని నెలలుగా రైతువేదికలకు నిర్వహణ నిధులు ఆగిపోయాయి. కలెక్టర్ ఆదేశానుసారం నిర్వహణ లోపం లేకుండా చూస్తున్నాం, రైతులకు సేవలు అందించే విషయంలో సమస్యలు తలెత్తకుండా ఏఈఓలు చూస్తున్నారు. నిధులు మంజూరు కాగానే రైతు వేదికల పెండింగ్ బిల్లులు చెల్లింపులు చేస్తాం.
– బాబురావు, జిల్లా వ్యవసాయాధికారి
మండలాలు 12
రైతువేదికలు 45
ఒక్కోదానికి బకాయి 3.60లక్షలు
మొత్తం బకాయిలు 1.62 కోట్లు
జిల్లాలోని రైతువేదికల్లో కనీస వసతులు కానరావడం లేదు. ఏఈఓలు పంటలకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు కంప్యూటర్లు ఉన్న విద్యుత్ బిల్లులు, మరమ్మతులకు నిధులు రావడం లేదు. ఉన్నతాధికారులకు పంపించాల్సిన నివేదికలు ప్రింట్ తీయడానికి ప్రింటర్లు కూడా లేవు. స్టేషనరీ, తాగునీటి ఖర్చులన్నీ ఏఈఓలే భరించాల్సి రావడం, సహాయకులు కూడా లేక అన్ని పనులు వారే చేయాల్సి వస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు. శుభ్రం చేయించే బాధ్యత జీపీలు నిర్వహించాలని సూచించినా ఎక్కడా పట్టించుకోవడం లేదు. చాలాచోట్ల నీటి సౌకర్యం లేక మరుగుదొడ్లు నిరుపయోగమయ్యాయి. దీంతో మహిళా ఉద్యోగులు, రైతులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా రైతువేదికల పెండింగ్ నిర్వహణ నిధులు వెంటనే మంజూరు చేయాలని, ఇప్పటి నుంచి నెలనెలా నిధులు విడుదల చేయాలని ఏఈఓలు, రైతులు కోరుతున్నారు.
అధికారులకు భారమైన నిర్వహణ
కనీస వసతుల కల్పనపై పట్టింపేది?
ఇబ్బందుల్లో రైతులు, ఏఈఓలు


