నకిలీ హాజరుకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

నకిలీ హాజరుకు చెక్‌

Mar 18 2026 11:14 AM | Updated on Mar 18 2026 11:14 AM

నకిలీ హాజరు ఉండదు

జిల్లాలో ఇలా..

ఉపాధి కూలీలకు ఎఫ్‌ఆర్‌ఎస్‌

భూపాలపల్లి రూరల్‌: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా నిధుల దుర్వినియోగం ఆగడంలేదు. ఈ నేపథ్యంలో పథకంలో అనేక మార్పులు తీసుకువస్తున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్‌ అటెండెన్స్‌ ప్రవేశపెట్టారు. ఇక నకిలీ హాజరు నమోదుకు చెక్‌ పెట్టేందుకు పనులకు హాజరయ్యే కూలీలకు ముఖగుర్తింపు హాజరు(ఎఫ్‌ఆర్‌ఎస్‌) చేస్తున్నారు. మార్చి 2 నుంచి కొత్త యాప్‌లో కూలీల హాజరు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కూలీల హాజరు తీసుకునే సమయంలో కూలీ ఫొటో, ఈకేవైసీ ప్రక్రియలో పొందుపరిచిన ఫొటో ఒకేలా ఉంటేనే హాజరు నమోదవుతుంది.

నూతన యాప్‌తోనే..

గతేడాది ఆగస్టు నుంచి ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌లో జిల్లాలోని కూలీల ఈ కేవైసీ ప్రక్రియ ఉపాధి హామీ సిబ్బంది పూర్తి చేశారు. తర్వాత ఎన్‌ఎంఎంఎస్‌ నూతన యాప్‌ను క్షేత్ర సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు, మేట్లకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ నూతన యాప్‌లో కూలీల హాజరును నమోదు చేస్తున్నారు.

నమోదు ఇలా..

పని ప్రదేశానికి వెళ్లిన క్షేత్ర సహాయకులు ముందుగా యాప్‌లో పనులకు వచ్చిన వ్యక్తి పని ఐడీ నంబర్‌ ఎంచుకుని మాస్టర్‌లో కనిపించే పేర్లపై కూలీ ఫొటో తీసి నమోదు చేస్తున్నారు. అప్పుడు ఈ కేవైసీ సందర్భంగా తీసిన ఫొటో ప్రస్తుతం తీసిన ఫొటో ఒకరిదే అయితే కూలీ హాజరు నమోదు అవుతుంది. పని ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో కూలీ పనులకు వచ్చిన మొత్తం సభ్యుల గ్రూపు ఫొటో మరోసారి తీసి యాప్‌లో నమోదు చేస్తారు. ఇలా రెండుసార్లు ఫొటో తీసి ముఖ గుర్తింపు హాజరు ప్రక్రియ ద్వారా నిత్యం కూలీ పనులకు వచ్చేవారి హాజరును నమోదు చేస్తున్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు నమోదుతో కూలీలకు డబ్బులు చెల్లింపు సమయంలో పూర్తి పారదర్శకత ఉంటుందని అధికారులు అంటున్నారు.

గతంలో అనేక సంఘటనలు..

జిల్లా వ్యాప్తంగా 1,06,033 జాబ్‌ కార్డులు ఉన్నాయి. 2,26,233 మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం 6,97,226 యాక్టివ్‌ జాబ్‌ కార్డులు, 1,24,549 మంది కూలీలు యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. గతంలో జిల్లాలోని పలు గ్రామాల్లో ఒకరికి బదులు మరొకరు కుటుంబ సభ్యులు పనులకు వెళ్లి హాజరు వేసుకున్నట్లు ఘటనలు సామాజిక తనిఖీల్లో పలుమార్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో బాధ్యుల నుంచి నిధులు రికవరీ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నూతన యాప్‌ అందుబాటులోకి తెచ్చింది. దీంతో నకిలీ హాజరు నమోదుకు ఆస్కారం ఉండదని అధికారులు అంటున్నారు.

నూతనంగా ఏర్పాటు చేసిన యాప్‌తో నకిలీ హాజరు ఉండదు. అవకతవకలు జరిగే అవకాశం ఉండదు. పనులకు వచ్చిన వారికే కూలీ వస్తుంది. హాజరు శాతంలో పారదర్శకత ఉంటుంది.

– బాలకృష్ణ, డీఆర్‌డీఓ

గ్రామపంచాయతీలు 248

జాబ్‌ కార్డులు 1,06,033

కూలీల సంఖ్య 2,26,270

యాక్టివ్‌ జాబ్‌ కార్డులు 69,726

యాక్టివ్‌ కూలీల సంఖ్య 1,24,349

నూతన యాప్‌తోనే నమోదు

ముఖం ఫొటోతోనే గుర్తింపు

ఈ కేవైసీతో సరిపోతేనే కూలీ నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement