గ్యాస్‌ సరఫరాలో పారదర్శకతకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సరఫరాలో పారదర్శకతకు ప్రాధాన్యం

Mar 18 2026 11:14 AM | Updated on Mar 18 2026 11:14 AM

గ్యాస్‌ సరఫరాలో పారదర్శకతకు ప్రాధాన్యం

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గ్యాస్‌ సరఫరా పారదర్శకంగా, నిరంతరంగా కొనసాగాలని అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని హెచ్‌పీ గ్యాస్‌, సింగరేణి కాలరీస్‌కు చెందిన భారత్‌ గ్యాస్‌ ఏజెన్సీలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వినియోగదారులకు అందిస్తున్న సేవలు, గ్యాస్‌ సరఫరా విధానం, నిల్వల పరిస్థితి, భద్రతా ప్రమాణాలను సమగ్రంగా పరిశీలించారు. గ్యాస్‌ సిలిండర్ల నిల్వ, పంపిణీ విధానం, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. వినియోగదారులకు సమయానికి గ్యాస్‌ సరఫరా అందించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. వినియోగదారుల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడంతో పాటు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలను పాటించాలని సూచిస్తూ, గ్యాస్‌ సరఫరాలో జాప్యం లేకుండా సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. ఎల్‌పీజీ డీలర్లు వినియోగదారుల బుకింగ్‌ సీక్వెన్స్‌ను తప్పనిసరిగా పాటిస్తూ గ్యాస్‌ రీఫిల్స్‌ను సరఫరా చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమాన్ని అతిక్రమించకూడదని ఆదేశించారు. జిల్లాలో గ్యాస్‌ కొరత ఎక్కడా లేదని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మి కొందరు వినియోగదారులు అవసరానికి మించి బుకింగ్స్‌ చేస్తున్నారని తెలిపారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు. గ్యాస్‌ నిల్వలు, బుకింగ్స్‌, ఆయిల్‌ కంపెనీల నుంచి రావాల్సిన సరఫరాపై పర్యవేక్షణ కోసం కలెక్టర్‌ రాహుల్‌శర్మ అధ్యక్షతన ఎనర్జీ సప్లై మానిటరింగ్‌ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ రోజువారీ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ సరఫరా వ్యవస్థను సక్రమంగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

6 గృహవినియోగ సిలిండర్ల స్వాఽధీనం

జిల్లాలోని వివిధ బేకరీలు, చికెన్‌ సెంటర్లపై సివిల్‌ సప్లయి ఇన్‌స్పెక్టర్లు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి గృహ వినియోగ ఆరు సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు సివిల్‌ సప్లయి ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గృహ వినియోగానికి కేటాయించిన సిలిండర్లను వాణిజ్య వంటలకు ఉపయోగించడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఇటువంటి అక్రమ వినియోగం వల్ల ప్రభుత్వానికి నష్టం కలగడమే కాకుండా, అర్హులైన గృహ వినియోగదారులకు ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు.

అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement