ఎస్‌ఎస్ తాడ్వాయి : మేడారంలో భక్తులు పడేసిన వ్యర్థాలు (ఎండి పోయిన అన్నం) తిని సుమారు వంద గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మహబూబ్‌నగర్ జిల్లా మరికెల మండల కేంద్రానికి చెందిన ఆంజనేయులు కొద్ది రోజుల క్రితం తనకున్న 200 గొర్రెలను తీసుకుని మేత నిమిత్తం తాడ్వాయి మండలం మేడారం అటవీ ప్రాంతానికి వచ్చాడు. ఊరట్టం పంచాయతీ పరిధిలోని పెట్రోల్ బంక్ సమీపంలో గొర్రెల మంద పెట్టుకుని సమీప అటవీ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఒక్కసారిగా గొర్రెలు అస్వస్థకు గురై సుమారు వంద మృత్యువాత పడ్డాయి. మేడారం వనదేవలతను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు పడేసిన వ్యర్థాలు తినడంతో గొర్రెలు అస్వస్థకు గురై మృత్యువాత పడినట్లు బాధిత గొర్రెల యజమాని ఆంజనేయులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు రూ.10 లక్షల పైగా నష్టం వాటిల్లిందని కన్నీరుమున్నీరయ్యాడు. మిగతా గొర్రెలు కూడా అనారోగ్యంగానే కనిపిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఆదుకుని పరిహారం చెల్లించాలని వేడుకున్నాడు.
ములుగు: బాలల రక్షణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ సంపత్‌రావు పేర్కొన్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాస్థాయి బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సమావేశాన్ని జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్‌రావు హాజరై మాట్లాడారు. జిల్లాలో నూతనంగా బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా, 14 మంది జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారని వివరించారు. బాలల రక్షణపై అవగాహన కల్పించడం, ఆరేళ్లకు పైబడిన బాలలందరూ బడికి వెళ్లేలా చూడడం, బడి మానేసిన పిల్లలను గుర్తించి వారిని తిరిగి బడిలో చేర్పించడం కమిటీ నిర్వహిస్తుందని తెలిపారు.


