భూపాలపల్లి: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని, అన్యాయానికి గురైన వారికి అండగా నిలవాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జిల్లాలోని పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా దివస్ కార్యక్రమంలో 15 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
పీపీ వాదనలతో నిందితులకు శిక్షలు
జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ వాదనలతో చాలా మంది నిందితులకు శిక్షలు పడ్డాయని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. క్రిమినల్ కేసుల్లో సమర్థవంతమైన వాదనలు వినిపిస్తున్న పీపీ శ్రీనివాస్‌ను సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అభినందించి ప్రశంస పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పీపీ శ్రీనివాస్ కృషి ద్వారా మొత్తం 12 కేసుల్లో దోష నిర్ధారణ జరిగిందన్నారు. అందులో ఏడు కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించగా, మిగిలిన కేసుల్లో కనీసం 10 సంవత్సరాల కారాగార శిక్షను కోర్టు విధించిందని ఎస్పీ వెల్లడించారు.
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


