న్యూస్‌రీల్
జిల్లాలో క్యాన్సర్ కేసుల వివరాలు
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో క్యాన్సర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఐదేళ్లలో 358 కేసులు నమోదయ్యాయి. పేదరికం, నిరక్షరాస్యతతో గ్రామీణులకు క్యాన్సర్‌పై అవగాహన లేకపోవడంతో ఏటా పదుల సంఖ్యలో మృతిచెందుతున్నారు. మొదట్లో గుర్తించకపోవడంతో చివరి దశలో ఆస్పత్రులకు వెళ్తున్నారు. దీంతో బతికే అవకాశాలు తగ్గుతున్నాయి. జిల్లాలో గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నట్లు వైద్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
జీవనశైలిలో మార్పులు..
జిల్లాలో ప్రతీ ఏట పదుల సంఖ్యలో క్యాన్సర్‌తో చనిపోతున్నారు. దురలవాట్లు, జీవన శైలిలో మార్పులతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. వ్యాధిపై అవగాహన ఉంటే ఆదిలోనే అరికట్టవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. పురుషుల్లో నోటి, వివిధ రకాల క్యాన్సర్లు వస్తుండగా, మహిళల్లో రొమ్ము, సర్విక్ రకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో క్యాన్సర్ నిర్ధారణ లేకపోవడంతో వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, ఇతర దూర ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు చేసుకొని వైద్య చికిత్సలు పొందుతున్నారు.
ఇలా గుర్తించండి..
నోటి, రొమ్ము, సర్విక్ క్యాన్సర్‌లను తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. రొమ్ములో గడ్డలు ఏర్పడితే మామోగ్రామ్ పరీక్ష చేయించాలి. మలం, యూరిన్‌లో రక్తం, తెల్లబట్ట, ఎర్ర బట్ట, ఒక్కసారిగా బరువు తగ్గడం జరిగితే సర్విక్ క్యాన్సర్‌గా భావించి హెచ్‌పీవీ డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోవాలి. ఏడాదికోసారి స్క్రీనింగ్ చేసుకోవడం ద్వార ముందస్తుగా గుర్తించే వీలుంటుంది. నోటి అల్సర్లు, దగ్గితే రక్తం పడటం, బరువు తగ్గడం లక్షణాలు కనిపిస్తే నోటి క్యాన్సర్ పరీక్ష చేయించాలి.
హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో అప్రమత్తం
క్యాన్సర్ దరిచేరకుండా ఉండేందుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. 9 నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలకు హెచ్‌పీవీ రెండు డోసుల్లో వేసుకోవాలి. 21 ఏళ్ల వరకు కూడా వేసుకోవచ్చు. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, చిట్యాల, మహదేవపూర్ సీహెచ్‌సీలో 14 నుంచి 15 ఏళ్ల పిల్లలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌లు వేస్తున్నారు. మహిళల్లో అధికంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు అధికంగా నమోదుతున్నాయి. ఈ క్యాన్సర్‌ను నివారించాలని ముందస్తుగా బాలికలను వ్యాక్సిన్ వేస్తున్నారు.
వ్యాయామం చేయాలి..
క్యాన్సర్‌ను మొదట్లో గుర్తిస్తే నయం చేయొచ్చు. రొమ్ము, సర్విక్ క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే తొలి దశలోనే ఆస్పత్రికి వెళ్లాలి. నిత్యం అర గంట వ్యాయామం చేయాలి. భోజనంలో ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. రెడ్‌మీట్, ఆయిల్స్, జంక్‌ఫుడ్స్ మానేయాలి.
– డాక్టర్ శ్రీదేవి, ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి


