రేగొండ: జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ముగిసి దాదాపు 9 నెలలు కావస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. ఆ పదవులపై కన్నేసిన వారికి ఉత్కంఠ తప్పడం లేదు. గతేడాది జూలై 4వ తేదీన జెడ్పీ, మండల పరిషత్ సభ్యుల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి జిల్లా, మండల పరిషత్‌లు ప్రత్యేధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. జిల్లాలో 12 జెడ్పీటీసీ, 119 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఇప్పటికే అధికార యంత్రాంగం ఓటరు జాబితా సిద్ధం చేసింది.
మారనున్న రిజర్వేషన్లు..
ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు మారే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు (42 శాతం బీసీ రిజర్వేషన్ల ప్రకారం) కేటాయించినా, ప్రస్తుత పరిస్థితులతో అవి మారే అవకాశాలే అధికంగా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అప్పటి రిజర్వేషన్లను రెండు సార్లు అమలు చేయాలి. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రాజకీయ సమీకరణాలతో కొత్త మండలం ఏర్పాటు కావడం, ఓటర్ల సంఖ్య పెరగడం లాంటి కారణాలతో రిజర్వేషన్లలో మార్పులు ఖాయమంటున్నారు.
మూడు నెలలు ఆగాల్సిందేనా?
ఇటీవల మున్సిపల్ ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వం ఆ వెంటనే ప్రాదేశిక సమరానికి సిద్ధపడుతుందని ఆశావాహులు భావించారు. కానీ ప్రాదేశిక ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం మార్పులు చేస్తుందనే ఊహగానాలు కూడా వినిపిస్తున్నాయి. అంతే కాదు ఎంపీపీ, జెడ్పీ చైర్ పర్సన్ స్థానాలకు పరోక్ష పద్ధతి కాకుండా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తుందనే ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఏ పద్ధతి అయినా ఎన్నికలు ఇప్పుడు నిర్వహించే పరిస్థితులైతే కనిపించడం లేదనే సంకేతాలు కూడా వస్తున్నాయి. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక పేరిట 99 రోజుల కార్యాచరణను ప్రభుత్వం చేపట్టడంతో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని ఆశావాహులు నిరాశకు గురవుతున్నారు.
ఇంకా స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
ఆశావహుల ఎదురుచూపు


