‘మేడిగడ్డ’ వినాశనానికి బాధ్యత వహించాలి | - | Sakshi
Sakshi News home page

‘మేడిగడ్డ’ వినాశనానికి బాధ్యత వహించాలి

Mar 16 2026 7:51 AM | Updated on Mar 16 2026 7:51 AM

కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వినాశనానికి అప్పటి కేసీఆర్‌ సర్కారే బాధ్యత వహించాలని రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ ప్రతినిధుల బృందం సభ్యులు పి.సుదర్శన్‌, బి.వెంకట్‌, సాయిబాబు, నున్నా నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. మహదేవపూర్‌ మండలంలో నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మి), అన్నారం (సరస్వతి), పెద్దపల్లి జిల్లా సుందిళ్లలో పార్వతి (సుందిళ్ల) బ్యారేజీలతో, పంపుహౌస్‌ను వారు ఆదివారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. అక్కడ కుంగిపోయిన పియర్లు, దెబ్బతిన్న గేట్లను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ సుమారు రూ.90 వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల వరకు ప్రజాధనాన్ని వెచ్చించిన ఈ ప్రాజెక్టులో జరిగిన నష్టం అత్యంత ఆందోళనకరమని అన్నారు. ఈ భారీ వైఫల్యానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వమే ప్రాథమిక బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. కేవలం కమీషన్లు, ప్రచారం కోసం శాసీ్త్రయత లేకుండా పనులు చేయించడంతో మేడిగడ్డ బ్యారేజీలో 19 నుంచి 22 వరకు ఉన్న గేట్ల ప్రాంతం కుంగిపోయిందని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, నాణ్యత లోపాలపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులైన అధికారులు, కాంట్రాక్ట్‌ సంస్థలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాధనాన్ని బూడిదలో పోసిన వారి ఆస్తులను జప్తు చేసి, ఆ నిధులతోనే జరిగిన నష్టాన్ని పూడ్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ సమస్యను కేవలం గత ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేసేందుకే పరిమితం చేయకూడదని సూచించారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి, నిపుణుల కమిటీ సూచనల మేరకు వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. వచ్చే వర్షాకాలంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, పంటలకు సకాలంలో నీరు అందించేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రాజెక్టు కేవలం ప్రచారానికే పరిమితమైందా అని నాయకులు ప్రశ్నించారు.

సీఎం రేవంత్‌ ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి మరమ్మతు చేయాలి

అధికారులు, కాంట్రాక్టర్లపై

కఠిన చర్యలు తీసుకోవాలి

రైతు, కూలీ, కార్మిక సంఘాల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement