వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని రామప్ప ఆలయ పరిసరాల్లోని జైన గుడిని పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డా.ఈమని శివనాగిరెడ్డి, టార్చ్ సంస్థ కార్యదర్శి అరవింద్ ఆర్య కోరారు. ఆదివారం వారు రామప్ప పరిసరాల్లోని కాకతీయ కట్టడాల ఆనవాళ్లను పరిశీలించిన అనంతరం జైన ఆలయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. గర్భాలయం, అర్ధమండపం, రెండింటికి ద్వారాలు, వాటిపైన జైన చిహ్నమైన పూర్ణకలశం, గర్భాలయంపై నాగర శైలి విమాన శిఖరం, దానికి అనుసంధానంగా సుకనాసి, కాకతీయ ఆలయ వాస్తుకు అద్ధం పడుతున్నాయని వివరించారు. గర్భాలయం లోపల పీఠంపై గల సింహం, శిల్పం, చివరి జైన తీర్థంకుడైన వర్ధమాన మహావీరుడి లాంఛనమని తెలిపారు. అందువల్ల ఈ ఆలయం వర్ధమాన మహావీరుడికి అంకితం చేశారన్నారు. వాస్తు నైపుణ్యం ఉన్న ఈ ఆలయాన్ని సైతం పదిలపరిస్తే సందర్శకులకు ఆకర్షణగా నిలుస్తుందని వివరించారు. రామప్ప ఆలయ సమీపంలోని రెండు సమకాలీన ఆలయాలను రక్షిత కట్టడాల జాబితాలో చేర్చిన కేంద్ర పురావస్తు శాఖ అధికారులను వారు అభినందిస్తూ, జైనుగుడిని కూడా ఆ జాబితాలో చేర్చాలని వారు కోరారు.


