భూపాలపల్లి అర్బన్: మే నెలలో కాళేశ్వరంలో నిర్వహించనున్న అంత్య పుష్కరాల పనులను వేగంగా చేసి గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అంత్య పుష్కరాల ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ, విద్యుత్, మిషన్ భగీరథ, వైద్య, ప్రణాళిక శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంత్య పుష్కరాల పనులు ఏప్రిల్ 30 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలి
ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12న మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, వార్డు సభ్యుల శిక్షణా తరగతులు నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం, 12వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ చైర్మన్, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు సభ్యుల శిక్షణా కార్యక్రమం నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడానికి, అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా చేపట్టేందుకు స్థానిక ప్రజాప్రతినిధులకు సమగ్ర అవగాహన కల్పించడం ముఖ్యమని తెలిపారు. అందుకు అనుగుణంగా నిర్వహించే శిక్షణా కార్యక్రమానికి సంబంధించి విభాగాల వారీగా మినిట్ టు మినిట్ ప్రోగ్రాం రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అమలుపై సమీక్ష నిర్వహించారు.
ఆరోగ్యంగా ఉంటేనే మెరుగైన సేవలు
ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల ఆధ్వర్యంలో మెడికవర్, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా కలెక్టరేట్‌లో మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్ మాట్లాడారు. ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.
సమగ్ర కార్యక్రమాలతో వ్యవసాయాభివృద్ధి
వ్యవసాయ రంగం అభివృద్ధికి దోహదపడేలా సమగ్ర కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వ్యవసాయ, ఉద్యాన శాఖలు చేపట్టాల్సిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పంటల దిగుబడి, పంట మార్పిడి, ఎరువుల వినియోగంపై, పామాయిల్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, జిల్లా అటవీశాఖ అధికారి నవీన్‌రెడ్డి, ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, టీజీఓ కార్యదర్శి సునీల్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ మహమ్మద్ సంధాని, కార్యవర్గ సభ్యులు డాక్టర్ మధుసూదన్, ఫణికుమార్, డాక్టర్ వెంకన్న, సంతోష్, శ్రీనివాసరావు, స్వాతి, వ్యవసాయ అధికారి బాబూరావు, ఉద్యాన అధికారి సునిల్ కుమార్ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ


