భూపాలపల్లి: జిల్లాలో 9 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ కాళేశ్వరం జోన్ ఇన్‌చార్జ్ డీఐజీ అంబర్ కిషోర్ ఝా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొగుళ్లపల్లి ఎస్సై బి.అశోక్‌ను గణపురం ఎస్సైగా, టేకుమట్లలో పని చేస్తున్న ఎస్సై డి.సుధాకర్‌ను రేగొండకు, చిట్యాలలో పని చేస్తున్న జి.శ్రావణ్‌కుమార్‌ను భూపాలపల్లి ఎస్సై 2గా, వేకెన్సీ రిజర్వ్‌లో ఉన్న ఎస్సైలు సాయి త్రిలోక్‌నాథ్‌రెడ్డిని కొత్తపల్లి గోరి ఎస్సైగా, పి.సతీష్‌ను చిట్యాల ఎస్‌హెచ్‌ఓగా, అమూల్యను టేకుమట్లకు, ములుగు జిల్లాలో వేకెన్సీ రిజర్వ్‌లో ఉన్న ఎం.సురేష్‌ను మొగుళ్లపల్లికి, గణపురం, కొత్తపల్లి గోరి ఎస్సైలు ఆర్.అశోక్, ఎస్.దివ్యలను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు పలువురు ఎస్సైలు మంగళవారం సాయంత్రమే ఆయా ఠాణాలకు చేరుకొని బాధ్యతలు తీసుకున్నారు.
ఆధునిక శిక్షణతో
యువతకు ఉపాధి
భూపాలపల్లి అర్బన్: ఐటీఐలో ఆధునిక శిక్షణ ద్వారా యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏటీసీ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మంగళవారం ఎమ్మెల్యే సత్యనారాయణరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఏటీసీ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 2ఈ, 3ఈ మిషన్, అడ్వాన్స్‌డ్ సీఎన్‌సీ మిషన్, రోబోటిక్ వెల్డింగ్ మిషన్, ఎలకి్ట్రక్ వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం నూతనంగా ప్రారంభించిన ఎలకి్ట్రక్ వాహనాన్ని ఎమ్మెల్యే సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ నడిపి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ అందించడం ద్వారా వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఐటీఐ విద్యార్థులు ఈ అవకాశాలను వినియోగించుకుని తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ఏటీసీ కేంద్రం ద్వారా విద్యార్థులు ఆధునిక యంత్రాలపై శిక్షణ పొందుతూ తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని తెలి పారు. ఇటువంటి శిక్షణ కేంద్రాలు యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జమ్మూలాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రామప్పలో
సింగరేణి బృందం
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని మంగళవారం ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి బృందం సందర్శించింది. ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో భూపాలపల్లిలో జరుగుతున్న పెట్రోల్ లీడర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా రామప్ప దేవాలయాన్ని స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ సాయి నిరంజన్ ఆధ్వర్యంలో సింగరేణి ఏరియాల నుంచి కలిసివచ్చిన పాఠశాలల స్కౌట్స్ అండ్ గైడ్స్ సందర్శించారు. అనంతరం వారు రామలింగేశ్వరస్వామిని దర్శించుకోగా టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వారికి ఆలయ చరిత్రను వివరించారు. కార్యక్రమంలో స్కౌట్స్ లీడర్స్ శ్రీనివాసరావు, స్వామి , మాస్టర్స్ రమేశ్, కుమార్, భాస్కర్, శైలజ, ప్రకాష్, సుమన్, నీలిమ పాల్గొన్నారు.


