సమస్యల నివేదన..
తొలి కౌన్సిల్ సమావేశంలో పట్టణ సమస్యలపై చర్చ
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సత్యనారాయణరావు, పక్కన కలెక్టర్ రాహుల్‌శర్మ
భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీ తొలి సమావేశంలోనే కౌన్సిలర్లు పట్టణంలోని అనేక సమస్యలపై గళమెత్తారు. అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించాలని కోరారు. మున్సిపాలిటీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య అధ్యక్షతన సోమవారం కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరు కాగా, కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కమిషనర్ ఉదయ్‌కుమార్ హాజరయ్యారు. తొలుత వివిధ శాఖల అధికారులు ఆయా శాఖల నివేదికలను వెల్లడించారు. సమావేశంలో పలువురు కౌన్సి లర్లు పట్టణంలోని సమస్యలను నివేదించారు.
ఆమోదం పొందని ఎజెండా అంశాలు..
కౌన్సిల్ సమావేశంలో పొందుపరిచిన ఎజెండాలోని అంశాలకు కౌన్సిలర్లు ఆమోదం తెలపలేదు. తప్పుడు బిల్లులు సమర్పించారని, కౌన్సిల్ ఏర్పాటుకు ముందు ఖర్చు చేసిన బిల్లులకు ఇప్పుడు ఆమోదం కోరడమేంటని పలువురు కౌన్సిలర్లు ప్రశ్నించారు.
నిధులు దుర్వినియోగం
చేయొద్దు : కలెక్టర్ రాహుల్ శర్మ
ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులను దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. పలువురు కౌన్సిలర్లు లేవనెత్తిన ప్రశ్నలకు స్పందిస్తూ.. వీధి వ్యాపారులకు మంజూరుచేసిన రుణాలపై నివేదిక అందించాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా తగు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
అభివృద్ధికి సహకరించాలి:
ఎమ్మెల్యే సత్యనారాయణరావు
జిల్లాలోని ఏకై క మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతీ ఒక్కరు సహకరించాలని ఎమ్మెల్యే సత్యనారాయణరావు కోరారు. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి రూ.82కోట్ల నిధులు ఇప్పించానని, త్వరలోనే బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయన్నారు. కౌన్సిలర్లు హుందాగా వ్యవహరిస్తూ గౌరవ మర్యాదలను కాపాడుకోవాలన్నారు. పలు శాఖలకు చెందిన అధికారులు కౌన్సిల్ సమావేశానికి హాజరుకాకపోవడం పట్ల ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
12వ వార్డు కౌన్సిలర్ బొంతల సతీష్ మాట్లాడుతూ తన వార్డులో తాగునీటి పైప్‌లైన్‌లు లీకేజీ అవుతున్నాయని, బోర్లు కాలిపోతున్నాయని అన్నారు. సింగరేణి సంస్థకు చెందిన చెత్తాచెదారం ఇష్టారాజ్యంగా పడేస్తున్నారని, రైతుల పంట పొలాలు కలుషితం అవుతున్నాయని తెలిపారు.
19వ వార్డు కౌన్సిలర్ కురిమిళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. లక్ష్మీనగర్‌లో ఉన్న వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరిందని, వెంటనే తొలగించాలని కోరారు.
29వ వార్డు కౌన్సిలర్ గండ్ర హరీశ్‌రెడ్డి మాట్లాడుతూ తన వార్డులోని బోరు పని చేయడం లేదని, డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందన్నారు. సీఎస్‌ఆర్ నిధులతో పునర్నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. పల్లె దవాఖానల పరిస్థితి అధ్వానంగా ఉందని, కేటీకే 6వ ఇంక్లైన్ ప్రహరీ వెంట ఉన్న యూకలిప్టస్ చెట్టు భారీగా పెరిగి ఎప్పుడు పడిపోతాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. 6వ ఇంక్లైన్ బ్యారెక్స్ వెనుక భాగంలో పార్కు, జిమ్ ఏర్పాటు చేయాలన్నారు.
కోతుల బెడద తీవ్రంగా ఉందని పలువురు కౌన్సిలర్లు కోరగా.. ఎమ్మెల్యే సత్యనారాయణరావు స్పందిస్తూ... తన నిధుల నుంచి వేయి కోతులు పట్టించేందుకు నిధులు ఇస్తానని, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సింగరేణి జీఎంలు కూడా తమవంతుగా నిధులు కేటాయించి కోతుల బెడద తీర్చాలని సూచించారు.
ఎజెండా అంశాలను
ఆమోదించని సభ్యులు
పట్టణాభివృద్ధికి తోడ్పడాలి :
ఎమ్మెల్యే, కలెక్టర్


