మల్హర్(కాటారం): ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అన్నారు. కాటారం మండలకేంద్రంలో పల్లె ప్రకృతి వనం క్లీనింగ్ పనులను డివిజనల్ పంచాయతీ అధికారి మల్లికార్జున్‌రెడ్డితో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
108 వాహనం తనిఖీ
రేగొండ: మండలకేంద్రంలో 108 వాహనాన్ని 108 జిల్లా మేనేజర్ రాజునాయక్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న సేవలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాహనంలోని పరికరాల పనితీరు, మందులు, రిజిస్టర్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీ శంకర్‌రావు, పైలట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఏఐఎఫ్‌బీ జిల్లా కన్వీనర్‌గా నరసింహారెడ్డి
భూపాలపల్లి అర్బన్: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) జిల్లా కన్వీనర్‌గా లక్కిరెడ్డి నరసింహారెడ్డి నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర కన్వీనర్, వైస్ ప్రెసిడెంట్ అంబటి జోజిరెడ్డి సోమవారం హైదరాబాద్‌లో నియామక పత్రం అందజేశారు. పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ నియామకం జరిగినట్లు తెలిపారు. నరసింహారెడ్డి నాయకత్వంలో జిల్లాలో పార్టీ కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
రామప్ప ఆలయ ఈఓగా బాధ్యతల స్వీకరణ
వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయానికి నూతన ఈఓగా (ఆలయ కార్యనిర్వహణాధికారి) ఇమ్మడి భాస్కర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హన్మకొండ మండలం వేలేరు మండల పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న భాస్కర్‌కు రామప్ప ఆలయ ఈఓగా అదనపు బాధ్యతలు కల్పిస్తూ దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఈఓగా పనిచేస్తున్న బిల్ల శ్రీనివాస్‌ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మండలగిరి వేంకటేశ్వరస్వామి ఆలయానికి అదనపు బాధ్యతలు కేటాయించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఈఓ భాస్కర్ రామప్ప రామలింగేశ్వరస్వామికి కుటుంబసమేతంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి హరీశ్‌శర్మ ఈఓ దంపతులను శాలువాతో సత్కరించారు.
పీఎం విశ్వకర్మ పథకాన్ని ఉపయోగించుకోవాలి
ములుగు: పీఎం విశ్వకర్మ పథకాన్ని అర్హులందరూ ఉపయోగించుకోవాలని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సిద్ధార్థ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్‌లో ఈడీసీర్యాంప్ ఆధ్వర్యంలో పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ రెడ్డి మాట్లాడారు. వడ్రంగులు, కంసాలులు, కుంచెవారు, దర్జీలు, నాయీబ్రాహ్మణులు, మట్టి పనివారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


