భూపాలపల్లి అర్బన్: ప్రజావాణిలో సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు అందచేసిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 45 దరఖాస్తులు స్వీకరించి తక్షణ చర్యలకు సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. దరఖాస్తులను అధికారులు జాప్యంచేయకుండా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన అన్ని దరఖాస్తులు వచ్చే సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి నాటికి పూర్తిగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారని, అందువల్ల అధికారులు బాధ్యతాయుతంగా దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. దరఖాస్తుల పరిష్కారంలో పర్యవేక్షణ లోపిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఆర్డీఓ హరికృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


