బాలికలకు ఆరోగ్య భరోసా | - | Sakshi
Sakshi News home page

బాలికలకు ఆరోగ్య భరోసా

Mar 8 2026 7:53 AM | Updated on Mar 8 2026 7:53 AM

నేడు ఉచిత హెచ్‌పీవీ టీకా ప్రారంభం

భూపాలపల్లి అర్బన్‌: మహిళల్లో ఎక్కువగా వచ్చే గర్భాశయ ముఖద్వారా (సర్వైకల్‌) క్యాన్సర్‌ నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. 14 ఏళ్లు నిండిన బాలికలకు హ్యుమన్‌ పాపిలోమా వైరస్‌(హెచ్‌పీవీ) టీకాలు ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. గత నెల 28వ తేదీన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. నేడు(ఆదివారం) మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించనున్నారు. క్షేత్రస్థాయిలో బాలికలకు టీకా ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు శనివారం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి మధుసూదన్‌ తన కార్యాలయంలో ప్రోగ్రాం అఽధికారులు, వైద్యాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఆదేశాలు జారీచేశారు.

100కు పైగా నమోదు..

మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌తో పాటు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లాలో 100 కేసులకు పైగా నమోదయ్యాయి. హ్యుమన్‌ పాపిలోమా వైరస్‌ కారణంగా ఇది సోకుతుందని చెబుతున్నారు. శరీరంలోనూ వైరస్‌ కారణంగా ఇది సోకుతుంది. శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొన్నేళ్ల తరబడి వృద్ధి చెంది క్యాన్సర్‌కు కారణమవుతుంది. ప్రాథమిక దశలో గుర్తిస్తే నయం కావడానికి అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కానీ అవగాహన లేమితో చాలామంది పరీక్షలు చేయించుకోక దీనిబారిన పడుతున్నారు. మొదటి దశలో గుర్తించలేక వ్యాధి ముదిరిపోయే దశలో బయటపడి మరణానికి దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

జిల్లాలో 2,400మంది విద్యార్థులు

ఇప్పటికే టీకా వేయడంపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు, ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇచ్చారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో, పట్టణాల్లో ఇంటింటి సర్వే జరిపి 14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపు ఉన్న బాలికలు 2,400 మంది ఉన్నట్లు గుర్తించారు. ఒక్కొక్కరికి ఒక డోసు హెచ్‌పీవీ టీకా వేయనుండగా భవిష్యత్‌లో వారికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ ముప్పు తలెత్తకుండా నియంత్రించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సర్వేకల్‌ క్యాన్సర్‌ నివారణకు హెచ్‌పీవీ టీకా 95శాతం వరకు రక్షణ ఇస్తుందని వైద్యులు గుర్తించారు.

మొదటి విడత మూడు కేంద్రాల్లో..

మొదటి విడతలో 30 రోజుల పాటు మూడు కేంద్రాల్లో వాక్సిన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేశారు. స్పెషల్‌ డ్రైవ్‌ కింద జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి, చిట్యాల, మహదేవపూర్‌లోని సీహెచ్‌సీలో హెచ్‌పీవీ వాక్సిన్లు వేస్తారు. ప్రతీ బుధవారం, శనివారాల్లో మాత్రమే టీకా వేయనున్నారు.

ఏర్పాట్లు పూర్తిచేశాం..

మహిళల్లో సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణ కోసం హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని నేడు జిల్లాలో ప్రారంభిస్తున్నాం. జిల్లాలో 2,400మంది బాలికలను ఇప్పటికే గుర్తించాం. టీకా పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇప్పటికే టీకా తీసుకున్నవారు తిరిగి తీసుకోవద్దు.

– డాక్టర్‌ చల్లా మధుసూదర్‌,

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

మొదటి విడతలో భూపాలపల్లి, చిట్యాల, మహదేవపూర్‌

14–15 ఏళ్లలోపు మధ్య వారికి టీకాలు

జిల్లాలో 2,400వేల మంది గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement