● ప్రతీ ఏటా మహిళలపై దాడులు
● అత్యధిక శాతం కేసులు పెండింగ్‌లోనే..
● బాధితులకు సకాలంలో అందని న్యాయం
భూపాలపల్లి: మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు చేస్తున్నా నేరాలు మాత్రం ఆగడం లేదు. జిల్లాలో ప్రతీ ఏటా వందల కేసులు నమోదవుతున్నా.. అత్యధిక కేసులు ఠాణాలు, కోర్టుల్లో పెండింగ్‌లో ఉండటంతో నేరస్తులకు సకాలంలో శిక్షలు పడటం లేదు.
వరకట్న వేధింపుల కేసులే ఎక్కువ..
లైంగిక దాడులు, హత్యలు ఒకటి రెండు మాత్రమే నమోదవుతుండగా.. వరకట్న వేధింపుల కేసులే అధికంగా నమోదవుతున్నాయి. జిల్లాలో మూడేళ్లుగా మహిళలపై నేరాల కేసులు 250కి పైగా నమోదు కాగా.. సగం కేసులు వరకట్న వేధింపులవే ఉన్నా యి. ఇందులో నూటికి 90 శాతం కేసులు చార్జ్‌షీట్ రాక పోలీస్‌స్టేషన్లలో పెండింగ్‌లో ఉండగా.. పదిశాతం కేసులు కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. మహిళల గౌరవానికి భంగం కలిగించిన కేసులు రెండో స్థానంలో నమోదవుతున్నాయి. లైంగిక దాడులవి ఏటా పదివరకు నమోదవుతున్నాయి.
పెండింగ్‌లోనే కేసులు..
వరకట్న హత్యలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యయత్నం, వేధింపులు, మహిళల హత్యలు, లైంగికదాడి, కిడ్నాపింగ్, మహిళల గౌరవానికి భంగం, రెండో పెళ్లిళ్లు తదితర కేసులు ప్రతీ ఏటా జిల్లాలో సగటున 250 వరకు నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో లోక్ అదాలత్‌లో పరిష్కారం అవుతుండగా, 150 వరకు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలినవన్నీ పోలీస్‌స్టేషన్లలో పెండింగ్, చార్జిషీట్ కోసం వేచి చూడటం తదితర కారణాలతో ఉన్నాయి.
2025లో నమోదైన కేసుల వివరాలు..
2025 సంవత్సరంలో వరకట్న ఆత్మహత్య కేసు ఒకటి నమోదు కాగా.. కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఆత్మాహత్యాయత్నం కేసులు ఆరు నమోదుకాగా రెండు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. వరకట్న వేధింపుల కేసులు 117 నమోదు కాగా 77 కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. మహిళ హత్య కేసులు ఐదు నమోదు కాగా.. ఒకటి కోర్టు పెండింగ్‌లో ఉంది. లైంగిక దాడుల కేసులు 10 నమోదు కాగా.. ఏడు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. కిడ్నాపింగ్ కేసులు 17 నమోదు కాగా ఒకటి కోర్టులో ఉంది. మహిళ గౌరవానికి భంగం కేసులు 97 నమోదు కాగా ఒక కేసులో రాజీ కుదరగా.. 59 కోర్టు పెండింగ్‌లో ఉన్నాయి. భర్తకు రెండో పెళ్లి కేసులు రెండు నమోదయ్యాయి.


