భూపాలపల్లి అర్బన్: ప్రతీ ఒక్కరు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందని.. ప్రతీ కుటుంబం పరిశుభ్రతను పాటించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మూడో వార్డులో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శుక్రవారం భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, డ్రెయినేజీలు, కాలనీలు, ఇళ్ల పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని ప్రజలకు సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ సౌకర్యాలు, డ్రెయినేజీ సమస్యలు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, మిడిల్ పోల్స్ అవసరం వంటి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్ మీటర్లు ఏర్పాటుచేసి విద్యుత్ సౌకర్యాలను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
ప్రజా ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా హెల్త్ మిషన్
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా హెల్త్ మిషన్ ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమం చేపట్టిందని శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. శుక్రవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో జంగేడు కేజీబీవీ హెల్త్ మిషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జూన్ 9వరకు కొనసాగే ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులకు నాణ్యమైన వైద్యసేవలను నేరుగా చేరవేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు


