భూపాలపల్లి పట్టణంలో కనిపించని చెత్తకుండీలు
● రోడ్ల వెంట చెత్త నిల్వలు
● పట్టించుకోని పాలకవర్గం,
అధికారులు
● ఇబ్బందుల్లో పట్టణ ప్రజలు
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ నిర్వహణ అధ్వానంగా మా రింది. పట్టణంతో పాటు విలీన గ్రామాల్లో ఏ మూ లన చూసినా చెత్త కుప్పలు కుప్పలుగా పేరుకుపోయి కనిపిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పట్టింపులేనితనం మూలంగా అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నా.. పట్టణ ప్రజలకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. కాలనీల ప్రజలతో పాటు విలీన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భూపాలపల్లి పట్టణంలో 30 వార్డులు ఉండగా చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదు. కాలనీల్లో వారానికి, పదిరోజులకు ఒక సారి చెత్త సేకరించేందుకు పారిశుద్ధ్య కార్మికులు వస్తున్నారని ఆయా కాలనీ ల వాసులు అంటున్నారు. చెత్త సేకరణ రోజువారీగా చేయకపోవడంతో కాలనీ వాసులు రోడ్లు, ఖాళీ స్థలాలు, మురికికాలువల్లో చెత్తను పడేస్తున్నారు. కాలనీలపై అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. పది రోజుల పాటు రోడ్లు, ఖాళీ స్థలాల్లో చెత్త కుళ్లిపోవడంతో దోమలు తీవ్రంగా వ్యాపిస్తున్నాయి.
జిల్లాలో ఏకైక మున్సిపాలిటీ మాత్రమే ఉంది. పట్టణంలో ఉన్న మురికినీటి కాలువల్లో చెత్తా చెదారం నిండిపోయి నీరు నిలుస్తోంది. చిన్న వర్షం వస్తే ఆ నీటితో కాలువలు పూర్తిగా నిండిపోతాయి. చాలావరకు ఇళ్లనుంచి వచ్చే చెత్తాచెదారాన్ని రోడ్డు పక్కన, కాలువల్లో పారవేయడం పరిపాటిగా మారింది. కొన్నిచోట్ల తాగునీటి కాలువలు పగిలి నీరు బయటకు వచ్చి సమీపంలోని మురికికాలువల్లో కలుసున్నాయి. దీంతో రోడ్డు మార్గంలో వచ్చిపోయే వారు ముక్కు మూసుకుని నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెత్త కుళ్లిపోవడం వలన దోమలు వ్యాపించి సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
భూపాలపల్లి పట్టణంలోని 30 వార్డుల్లో సుమారు 70వేల మంది నివసిస్తున్నారు. ఇంత పెద్ద పట్టణానికి కేవలం 17 చెత్త కుండీలు మాత్రమే కొనుగోలు చేసి అక్కడక్కడ ఏర్పాటు చేశారు. అవి అక్కడక్కడ ధ్వంసమై నిరుపయోగంగా మారాయి. కాలనీల్లో వారంలో ఒకటి రెండు సార్ల మాత్రమే చెత్తను సేకరించడం వలన చెత్తను నిల్వ చేసుకోలేక కాలనీల్లో ఖాళీ స్థలాలు, రోడ్డు పక్కన, మురికి కాలవల్లో చెత్తను పడేస్తున్నారు. పట్టణంలో ప్రతీ కాలనీలో రెండు కుండీలను ఏర్పాటు చేయడం వలన రోడ్లు, ఖాళీ స్థలాల్లో చెత్త పడేయకుండా ఉండే అవకాశం ఉంటుంది.
నిరుపయోగంగా మారిన పాడైన చెత్తకుండి


