సమర్థవంతంగా ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ | - | Sakshi
Sakshi News home page

సమర్థవంతంగా ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’

Mar 6 2026 8:17 AM | Updated on Mar 6 2026 8:17 AM

కలెక్టర్‌ రాహుల్‌శర్మ

భూపాలపల్లి అర్బన్‌: పారిశుద్ధ్య కార్యక్రమాలు, పరిశుభ్రత, పెండింగ్‌ ఫైళ్ల క్లియరెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని.. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ ఆదేశించారు. నేటి నుంచి ప్రారంభం కానున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు నేపథ్యంలో గురువారం వివిధ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాలు, పట్టణాలలో స్వచ్ఛత కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు శుభ్రమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు సేవలను వేగవంతంగా అందించాలన్నారు. ప్రతీ శాఖ తమ పరిధిలో ఉన్న పనుల పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షిస్తూ నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ సూచించారు. ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్‌, విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, డీపీఓ శ్రీలత, మున్సిపల్‌ కమిషనర్‌, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు.

పరీక్షలకు సిద్ధం కావాలి

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ధైర్యంగా సిద్ధం కావాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ సూచించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్‌ రాహుల్‌శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదివి మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హరికృష్ణ, డీఈఓ రాజేందర్‌, ఎస్‌ఓ ఈశ్వరిలు పాల్గొన్నారు.

పరీక్ష కేంద్రం పరిశీలన

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ రాహుల్‌శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ విధానం, భద్రతా ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హరికృష్ణ, పరీక్షల విభాగం చీఫ్‌ సూపరింటెండెంట్‌ సదానందం, సిబ్బంది పాల్గొన్నారు.

మీ సేవ రాత పరీక్ష

మీ సేవ సెంటర్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 29న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ రాహుల్‌శర్మ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement