భూపాలపల్లి అర్బన్: కేసుల విచారణలో ఫోరెన్సిక్ నివేదికలు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నాగరాజు తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ, ప్రొబేలాబ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం అడీషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోరెన్సిక్ నివేదికలు, వేలిముద్రల విశ్లేషణ, చేతిరాత పరిశీలన, సైబర్ ఫోరెన్సిక్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఫోరెన్సిక్ నివేదికలపై న్యాయవాదులకు పూర్తిస్థాయి అవగాహన ఉన్నప్పుడే కేసుల విచారణ సులభతరం అవుతుందన్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలను సకాలంలో సేకరించి, వాటిని శాసీ్త్రయంగా విశ్లేషించి కోర్టు ముందు సమర్పించినప్పుడు కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, ప్రొబేలాబ్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు మోహన్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇందరపు శివకుమార్, భూపాలపల్లి ఎస్సై రవళి, సీనియర్ న్యాయవాదులు కూనూరి సురేష్‌కుమార్, పగడాల ఆనందరావు, రాజ్‌కుమార్, చిరంజీవి, రవీందర్, ప్రియాంక పాల్గొన్నారు.


