● ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్
భూపాలపల్లి: నిత్యం విధులు నిర్వహిస్తూ ఒత్తిడికి గురవుతున్న పోలీసులకు మానసికోల్లాసం కలిగించడానికే జిల్లా స్థాయి నాలుగో పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహణ చేపడుతున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా స్థాయి నాలుగో పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌ను ఈనెల 6తేదీ (శుక్రవారం) నుంచి ఈనెల 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 194 మంది పోలీస్ సిబ్బంది పాల్గొననున్నట్లు చెప్పారు. పోలీసుల కోసం ట్రాక్ ఈవెంట్స్‌తో పాటు క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ తదితర క్రీడా పోటీలను పురుషులు, మహిళల విభాగాల్లో నిర్వహించనున్నట్లు వివరించారు. నిత్యం విధులు నిర్వహిస్తూ ఒత్తిడికి గురవుతున్న పోలీస్ సిబ్బందికి ఒత్తిడిని తగ్గించడం, శారీరక ధృఢత్వం పెంపొందించడం ఈ క్రీడా పోటీల ప్రధాన ఉద్దేశమన్నారు. పోలీస్ సిబ్బందిలో క్రీడాస్ఫూర్తి, ఐక్యత, పరస్పర సమన్వయం పెంపొందించడమే ఈ స్పోర్ట్స్ మీట్ ముఖ్య లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు. పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం కింద జిల్లాలోని 13 పోలీస్ స్టేషన్ల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులకు వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల యువతను భాగస్వామ్యం చేయించడం ద్వారా పోలీసులు, ప్రజల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.


