భూపాలపల్లి: జిల్లాకేంద్రంలోని భూపాలపల్లి పట్టణంలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇటీవలే మున్సిపాలిటీలోని 30 వార్డులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కై వసం చేసుకొని తన పట్టును నిరూపించుకోగా, ఇప్పుడు అందరి దృష్టి కో–ఆప్షన్ సభ్యుల ఎంపికపై పడింది. పాలకమండలిలో కీలకంగా వ్యవహరించే ఈ నాలుగు స్థానాల కోసం అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది.
పది మందికి పైగా ఆశావహులు..
భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డు స్థానాలు ఉండగా నలుగురు కోఆప్షన్ సభ్యులను నియమిస్తారు. అందులో ఇద్దరు మైనార్టీలు (ఒక మహిళ, ఒక పురుషుడు), మిగిలిన రెండింటిలో ఒకరు మాజీ ప్రజాప్రతినిధి, మరొకరు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉన్న వారిని నియమిస్తారు. నలుగురిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండాలనే నిబంధన ఉంది. మున్సిపాలిటీలో ఓటరుగా ఉండి, 21 ఏళ్లు దాటిన వారై ఉండాలి. ఈ రిజర్వేషన్ల లెక్కలు తేలడంతో, ఆయా వర్గాలకు చెందిన నాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో, ఈ పదవులను దక్కించుకుంటే స్థానికంగా పట్టు సాధించవచ్చని ఆశావహులు భావిస్తున్నారు. మైనార్టీ విభాగం నుంచి హఫీజ్, మాజీ ప్రజాప్రతినిధుల విభాగం నుంచి తాటి అశోక్, శిరుప అనిల్, ముంజాల రవీందర్, సజ్జనపు స్వామితో పాటు మరి కొంతమంది కోఆప్షన్ పదవులను ఆశిస్తున్నారు.
ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణ
కోఆప్షన్ సభ్యుల ఎంపికలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నిర్ణయమే అత్యంత కీలకం. దీంతో ఆశావహులంతా ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏం ఆశించకుండా కష్టకాలంలో సైతం వెన్నంటి ఉన్నాం.. ఇప్పుడైనా తమ కష్టానికి గుర్తింపునిచ్చి అవకాశం ఇవ్వాలి.. అంటూ ఆశావహులు ఎమ్మెల్యే ముందు మొరపెట్టుకుంటున్నారు.
ఓడిపోయాం.. ఒక్క చాన్స్ ప్లీజ్..
మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన వారు, లేదా రిజర్వేషన్ల మార్పు వల్ల పోటీచేసే అవకాశం కోల్పోయిన వారు అధికార కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు. వీరంతా కౌన్సిల్‌లో అడుగుపెట్టి తమ గళాన్ని వినిపించాలని తహతహలాడుతున్నారు. ఈ కోఆప్షన్ పదవులను మాజీ కౌన్సిలర్లు ఒక ‘లైఫ్ లైన్’లా భావిస్తున్నారు. రిజర్వేషన్లు అనుకూలించక పోటీకి దూరమైన కొందరు సీనియర్లు కూడా ఈసారి ఎలాగైనా పదవి దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే చుట్టూ
ఆశావహుల ప్రదక్షిణ
సత్తన్న నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి


