జాతరకు ప్రత్యేక బస్సులు..
రేగొండ: మండలంలోని కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. మంగళవారం హోలీ పండుగ సందర్భంగా ఉదయం హోమం, బలిహరణం, మహాపూర్ణాహుతి కార్యక్రమాల అనంతరం భక్తులకు నైవేద్యం అందజేశారు. అనంతరం చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసేశారు.
జాతరలో పోలీస్ బందోబస్తు..
కోటంచలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ తరఫున భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు తెలిపారు. మంగళవారం జాతరలో పోలీస్ బందోబస్తు గురించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. జాతరలో 10 మంది ఎస్సైలు, 170 మంది పోలీస్ సిబ్బంది పని చేయనున్నట్లు తెలిపారు. ఆలయ పరిసరాలు, జంక్షన్లు, గ్రామపరిధిలో మొత్తం 18 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేయనున్నట్లు తెలిపారు. భక్తులు ఎలాంటి ఘర్షణలు పడకుండా పోలీసుల సూచనలు పాటిస్తూ శాంతిభద్రతలు పర్యవేక్షించేలా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ క మిటీ చైర్మన్ నాయినేని సంపత్‌రావు, ఆలయ ఈఓ మహేష్, గణపురం సీఐ కరుణాకర్, ఎస్సైలు రాజేష్, దివ్య, షాఖాన్, అమూల్య, శంకరయ్య, కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది రవీందర్, శ్రావణ్, సుధాకర్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నేటినుంచి జాతర ప్రారంభం
కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం బోనాలు తిరుగుటతో జాతర ప్రారంభమవుతుంది. సాయంత్రం పెద్ద రథోత్సవం, స్వామి వారి, అమ్మ వార్ల గజవాహనాల ఊరేగింపు, ఎడ్లబండ్లు, ప్రభబండ్లు, ఇతర వాహనాలు తిరుగు కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు బుచ్చమాచార్యులు తెలిపారు.
కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేడు, రేపు జరిగే జాతరకు పరకాల, భూపాలపల్లి డిపోల నుంచి ప్రత్యేకంగా బస్సులు నడిపిస్తున్నట్లు భూపాలపల్లి డిపో మేనేజరు ఇందు తెలిపారు. కోటంచ జాతరకు వచ్చే భక్తుల రద్దీని బట్టి బస్సులు నడిపిస్తామని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.


