భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ప్రజలకు చేరువగా పోలీస్‌శాఖ పని చేస్తుందని ఎస్పీ సంకీర్త్ తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా 8 ఫిర్యాదులు అందగా, వాటిని శ్రద్ధగా విన్న ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులకు తక్షణ సూచనలు జారీ చేశారు. సమస్యలపై వెంటనే స్పందిస్తూ సంబంధిత సీఐలు, ఎస్‌ఐలతో నేరుగా మాట్లాడి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా, మూడో వ్యక్తుల ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే న్యాయం జరుగుతుందని, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ లక్ష్యమని తెలిపారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజాదివస్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి, సంబంధిత అధికారుల సహకారంతో తక్షణ పరిష్కారం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
శ్రీపాదరావుకు ఘననివాళి
దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలను ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ సంకీర్త్ శ్రీపాదరావు చిత్రపటానికి పూలవేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన ప్రజాసేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్‌కుమార్, ఆర్‌ఐలు రత్నం, పూర్ణచందర్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ సంకీర్త్


