మూణ్నాళ్ల ముచ్చట
భూపాలపల్లి అర్బన్: జీవితాంతం కలిసిమెలసి జీవిస్తామని అగ్ని సాక్షిగా ఒక్కటైన కొందరు దంపతులు.. పెళ్లి ముచ్చట తీరకముందే గొడవలు పడుతున్నారు. ప్రేమ, ఆప్యాయతలతో ఆనందంగా ఉండాల్సి వారు అపోహలు, అనుమనాలతో విడిపోతున్నారు. ‘నీవే నా ప్రాణం, నీవు లేకపోతే చచ్చిపోతా’ అంటూ పెళ్లి అయిన తొలినాళ్లలో ఎంతో ప్రేమ చూపేవారు.. ఆ తర్వాత వాటిన్నంటిని మరిచిపోయి ఒకరిపై ఒకరు ఛీదరించుకోవడం, కోప్పడడం.. చివరకు విడాకుల వరకు వెళ్తున్నారు. కొందరు చిన్నచిన్న విభేదాలు, వివాదాలతో కోర్టుకు ఎక్కుతుంటే.. మరికొందరు కక్షకార్పణ్యాలతో రగిలిపోతున్నారు. జీవితాంతం కలిసి జీవించాల్సిన భార్యాభర్తలు తమ బంధాలను బలహీనపర్చుకుంటున్నారు. గృహహింస విభాగం సిబ్బంది, పోలీసులు కౌన్సెలింగ్‌తో కొందరు సర్దుకుపోతున్నారు. మరికొందరు భవిష్యత్‌ను అంధకారం చేసుకోవడంతో పాటు వారి పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలను దూరం చేస్తున్నారు. తరచూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడంతో పెళ్లి అంటేనే పిల్లల తల్లిదండ్రులు ఆలోచనలో పడుతున్నారు.
వివిధ కారణాలతో..
పెళ్లయిన కొద్ది రోజులకే భర్త పట్టించుకోవడం లేదని, అత్తమామలు, ఆడపడుచులు వేధిస్తున్నారని మహిళలు గృహ హింస విభాగాన్ని ఆశ్రయిస్తున్నారు. మరి కొంతమంది పోలీస్ స్టేషన్‌లో కేసు పెడుతున్నారు. మరికొందరు నేరుగా కోర్టులో కేసు పెడుతున్నారు. జిల్లాలో 2022 నుంచి 2025 సంవత్సరం వరకు పోలీస్‌స్టేషన్, కోర్టు, సఖి కేంద్రంలోని గృహ హింస విభాగాన్ని 600 మందికిపైగా ఆశ్రయించారు. వీరిలో 40 మంది గృహహింస విభాగం సిబ్బంది ఇచ్చిన కౌన్సెలింగ్‌లో రాజీపడ్డారు. కోర్టులో 401 మంది కేసులు ఫైల్ చేశారు. వీరిలో 213 కోర్టు ద్వారా విడాకులు సైతం తీసుకున్నారు. 188 మంది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
కౌన్సెలింగ్ ఇచ్చినా..
వివిధ కారణాలతో విడిపోయేందుకు సిద్ధపడుతున్న దంపతులను కలపడానికి ఎన్ని కౌన్సెలింగ్‌లు ఇచ్చినా ఫలితం లేకుండా పోతుంది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలు ఏర్పడడంతో సంప్రదాయాలు, సత్సంబంధాలు తెలి యడం లేదు. ఒకరి నిర్ణయాలకు ఒకరు గౌరవించుకోకపోవడం, మొండివైఖరితో భవిష్యత్‌ను అంధకారం చేసుకుంటున్నారని పోలీసులు, గృహ హింస కౌన్సెలింగ్ విభాగం సిబ్బంది చెబుతున్నారు.
వేరు కాపురాలపై ఆసక్తి
ఉమ్మడి కుటుంబంలో కలిసి జీవించేందుకు అధికశాతం మంది యువతులు సుముఖత చూపడం లేదు. అదేమని అడిగితే అత్తమామాలు, ఆడపడుచుల దెప్పి పొడుపులు ఉంటాయని చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని ఆలోచిస్తున్నారు. ఉమ్మడి కుటుంబంలో తమ కుమార్తె హాయిగా జీవించగలదనే భరోసా కల్పించలేకపోతున్నారు. కారణం ఏదైనా చిన్న కుటుంబంగా జీవించడం అలవాటు పడుతున్న నేటి పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబాలకు ససేమిరా అంటున్నారు. ఇది కూడా పండంటి కాపురాలకు అవరోదంగా మారింది.
ఎవరికి వారే మొండిపట్టు..
గతంలో సంప్రదాయాలను గౌరవిస్తూ ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తూ పిల్లలకు ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా నిలిచేవారు. ఏవైనా సమస్యలు వస్తే ఉమ్మడి కుటుంబాలు కావడంతో ఇద్దరికీ సర్దిచెప్పి వారి మధ్య మనస్పర్దలను తొలగించేందుకు కుటుంబ పెద్దలు ప్రయత్నించేవారు. అప్పటికీ మాట వినకపోతే ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి భార్యభర్తలు ఇద్దరినీ ఒక్కటి చేసేవారు. ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. పెద్దలమాటను గౌరవించని, సమాజ విలువలు పాటించని, వివాహబంధాలను లెక్కచేయని యువతీ యువకులు వివాదాల్లో చిక్కుకుని, కుటుంబసభ్యులను మనోవేదనకు గురిచేస్తున్నారు.
నాలుగేళ్లలో 213 జంటలకు విడాకులు
పెండింగ్‌లో 200లకుపైగా కేసులు
కౌన్సెలింగ్‌తో కొన్ని జంటలు మాత్రమే కలయిక
పెళ్లయినా కొన్నిరోజులకే విడిపోతున్న వైనం


