అన్నదాతలకు అందని సాయం
భూపాలపల్లి: రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం ఎప్పుడు ఖాతాల్లో జమ చేస్తుందా అని అన్నదాతలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. యాసంగి సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా పెట్టుబడి సాయం అందకపోవడంతో ఆర్థికంగా రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. చేసేది లేక అడ్తీదారులు, వడ్డీ వ్యాపారుల వద్ద డబ్బులు తీసుకొచ్చి పంటలను సాగు చేస్తున్నారు.
అప్పులు చేసి పెట్టుబడులు..
గత వానాకాలం సీజన్‌లో రైతులు ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాలేదు. అకాల వర్షాలు కురవడంతో పత్తి, మిర్చి, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పత్తి పంటలను పురుగు ఆశించడంతో పలువురు రైతులు చేసేది లేక ఆ పంటను తొలగించి మొక్కజొన్న సాగు చేశారు. వానాకాలంలో పెట్టిన పెట్టుబడులు సైతం రాకపోవడంతో యా సంగిలో ఇతర పంటల వైపు రైతులు మొగ్గు చూపారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా సకాలంలో ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు విడుదల చేయకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్డీ వ్యాపారుల వద్ద నూటికి రూ.3 చొప్పున మిత్తికి, అర్తీదారుల వద్ద అప్పులు తీసుకొని పంటలు సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతు భరోసా విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
రైతు భరోసా విషయమై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదు. ప్రభుత్వం నుంచి విడుదల కాగానే నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. రైతులు చేస్తున్న పంటల సాగు, బ్యాంకు ఖాతాల వివరాలు ప్రభుత్వానికి నివేదించాం.
– బాబురావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
మరో నెలన్నర రోజుల్లో ముగియనున్న యాసంగి సీజన్
పెట్టుబడి కోసం అడ్తీదారుల వద్ద అప్పులు
జిల్లాలో 1,08,418 మంది లబ్ధిదారులు


