సర్కారు బడుల్లో కానరాని క్రీడా మైదానాలు
● క్రీడా సామగ్రి కరువు
● ఏడు పీఈటీ పోస్టులు ఖాళీ
కాటారం: ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మైదానాలు లేక విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాముఖ్యం కల్పించాల్సి ఉండగా.. ఆటలు ఆడుకొనే అవకాశం మాత్రం అందని ద్రాక్షగానే మారిపోయింది.
మొక్కుబడిగా ఆటలు..
జిల్లాలో 428 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా సుమారు 40 పాఠశాలల్లో మినహా ఎక్కడా సరైన క్రీడా మైదానాలు లేవు. అవి కూడా అసంపూర్తి సౌకర్యాలతోనే నెలకొనడంతో ఆటలు ఆడటం విద్యార్థులకు ఇబ్బందిగా మారుతుంది. వర్షాలు కురిస్తే గ్రౌండ్‌లలో అడుగు పెట్టలేని దుస్థితి నెలకొంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు జనవరి 26 రిపబ్లిక్‌డే, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని విద్యార్థులకు మొక్కుబడిగా ఆటలు ఆడిస్తున్నారే తప్పా మెరుగైన క్రీడాకారులుగా తీర్చిదిద్దే ప్రయత్నం మాత్రం కానరావట్లేదు. ఆటవిడుపుగా అన్నట్లుగా ఏడాదికోమారు తూతూ మంత్రంగా మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు.
క్రీడా సామగ్రి కరువు..
కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలకు స్పోర్ట్స్ ఫండ్ అందకపోవడంతో క్రీడా సామగ్రి, పరికరాలు కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో కొనుగోలు చేసిన క్రీడా పరికరాలను మరమ్మతు చేసుకొని విద్యార్థులు ఆటలు ఆడాల్సి వస్తుంది. ప్రధాన క్రీడలైన వాలీబాల్, క్రికెట్‌తో పాటు షాట్‌ఫుట్, జావెలిన్ త్రో, ఆర్చరీ, ఇతర అథ్లెటిక్ పరికరాలు ఏ పాఠశాలలో చూసినా కానరావడం లేదు. దీంతో విద్యార్థులు ఆటలపై మక్కువ కోల్పోతున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం పీఎంశ్రీ కింద ఎంపికై న పాఠశాలలకు మినహా ఏ ప్రభుత్వ పాఠశాలకు స్పోర్ట్స్ ఫండ్ మంజూరు చేయలేదు.
ఏడు పీఈటీ పోస్టులు ఖాళీ..
జిల్లాలో 37 పీఈటీ పోస్టులు ఉండగా 30 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. మరో ఏడు పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల పీఈటీలకు పీడీలుగా ప్రమోషన్ కల్పించి పలు పాఠశాలలకు నియమించగా జిల్లాలో అప్‌గ్రేడ్ పొందిన ఏడు పాఠశాలలకు వ్యాయామ ఉపాధ్యాయులు లేరు. దీంతో విద్యార్థులు క్రీడలకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
క్రీడలతో కూడిన బోధన
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులతో విద్యతో పాటు క్రీడా బోధన జరిగేలా చర్యలు తీసుకుంటాం. పీఈటీలు ఆయా పాఠశాలల్లో ఉన్న సౌకర్యాల మేర విద్యార్థులకు ఆటలు ఆడిపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా నిర్వహణ, సామగ్రి కొనుగోలుకు త్వరలోనే స్పోర్ట్స్ ఫండ్ మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి.
– రాజేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి
సర్కారు బడుల్లో కానరాని క్రీడా మైదానాలు


