
వంట వండేదెట్ల..?
● మధ్యాహ్న భోజన నిర్వాహకుల అవస్థలు
● నిలిచిన బిల్లులు.. పెరిగిన ధరలు
● అప్పులు చేసి నెట్టుకొస్తున్న ఏజెన్సీలు
కాటారం: నెల నెలా సక్రమంగా బిల్లులు అందకపోవడం.. నిత్యావసర సరుకులు, కోడిగుడ్ల ధరలు పెరగడంలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పెరిగిన కూరగాయలు, గుడ్లు, పప్పు దినుసులు, వంట చెరుకు, గ్యాస్ ధరలతో తమపై అధిక మొత్తంలో ఆర్థికభారం పడుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
నాలుగు నెలలుగా నిలిచిన బిల్లులు..
జిల్లాలో 12 మండలాల్లో మొత్తం 432 పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థులకు భోజనం పెట్టేందుకు ఒక పాఠశాలకు నెలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా సుమారు రూ.లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు వ్యయం అవుతుంది. ఇలా జిల్లాలో ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఒక్కో నెలకు సంబంధించి సుమారు రూ.46 లక్షల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. నాలుగు నెలలకు సంబంధించి కోటి 84లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన బిల్లులు అందలేదని నిర్వాహకులు చెబుతున్నారు. లక్షల్లో బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఏజెన్సీల మహిళలు ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. బిల్లులు నెలవారీగా రాకపోవడం కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు, విపరీతంగా పెరిగిపోవడంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ కష్టతరంగా మారుతుందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరిగిన ధరలు..
మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు సన్నబియ్యం పౌరపరఫరాల శాఖ నుంచి సరఫరా చేస్తుండగా.. ఇతర సామగ్రి నిర్వాహకులు సమకూర్చుకుంటున్నారు. భోజనంలో ఆకుకూరలు, వారానికి మూడు సార్లు కోడిగుడ్లు అందజేయాలి. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు కుకింగ్ చార్జీల కింద ఒక్కొక్కరికి రూ.6.29 చెల్లిస్తారు. 9, 10 తరగతుల విద్యార్థులకు రూ.8.40 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. కోడిగుడ్డుకు రూ.6 చెల్లిస్తుంది. కానీ ప్రస్తుతం కోడి గుడ్డు ధర రూ.7 ఉండగా దోసకాయలు, ఆలుగడ్డ, బీరకాయ, దొండకాయతో పాటు ఆకుకూర ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఏ కూరగాయల ధర చూసినా కిలోకు రూ.60 కంటే తక్కువగా లేదు. కోడిగుడ్డుకు రూ.1 అదనంగా చెల్లించి విద్యార్థులకు పెట్టాల్సి వస్తుందని.. అధిక ధరలు వెచ్చించి కూరగాయలు కొనుగోలు చేయాల్సి వస్తుందని నిర్వాహకులు అంటున్నారు. ధరలు పెరుగుతున్నప్పుడు అందుకు అనుగుణంగా బిల్లులు పెంచడం లేదని అంటున్నారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న పాఠశాలల్లో భోజన పథకం నిర్వహణ మరింత భారం అవుతుంది.
బిల్లులు అందేలా చూస్తాం..
మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో లేకుండా అందేలా చూస్తాం. నిధులు మంజూరు కాగానే సంబంధిత ఏజెన్సీల ఖాతాల్లో జమఅయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఏజెన్సీ నిర్వాహకుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికరమైన మధ్యాహ్న భోజనం అందేలా చూస్తున్నాం.
– రాజేందర్, డీఈఓ
ప్రభుత్వ పాఠశాలలు 432
విద్యార్థులు 19,788
వంట నిర్వాహకులు 510
వంట ఏజెన్సీలు 415

వంట వండేదెట్ల..?