
కాలసర్ప, శని పూజలకు భక్తుల రద్దీ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ, నవగ్రహాల వద్ద శనిపూజలకు శనివారం భక్తుల రద్దీ నెలకొంది. ముందుగా భక్తులు త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేసి కాలసర్ప, శని పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి కనిపించింది.
ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ
భూపాలపల్లి అర్బన్: హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్యారోగ్యశాఖ, దిశ ములుగు ఆధ్వర్యంలో శనివారం భూపాలపల్లి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక పీహెచ్‌సీ నుంచి అంబేడ్కర్ సెంటర్ మీదుగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారిణి డాక్టర్ ఉమాదేవి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన సమావేశానికి ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఉమాదేవి, ఆస్పత్రి ఆర్‌ఎంఓలు డాక్టర్ దివ్య, డాక్టర్ రాజేష్, దిశ క్లస్టర్ మేనేజర్ జ్యోతి, మారి సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ సదానందం హాజరై వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. 2030 సంవత్సరం నాటికి హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రించడంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ సిబ్బంది, మారి సంస్థ కార్యకర్తలు పాల్గొన్నారు.
టిప్పర్ యజమానుల సమ్మె
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని బొగ్గు రవాణా చేస్తున్న టిప్పర్లకు రవాణా చార్జీలు పెంచాలని కోరుతూ.. టిప్పర్ యాజమానులు సమ్మె చేపడుతున్నారు. ఈ మేరకు శనివారం కోల్ ట్రాన్స్‌ఫోర్ట్ టిప్పర్ ఓనర్స్, వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భూపాలపల్లి ఏరియాలోని ఓసీపీ–2,3, తాడిచర్ల ఓపెన్ కాస్టుల వద్ద టిప్పర్లను అడ్డుకొని డ్రైవర్లకు గులాబీ పువ్వు అందించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రొడ్డ రవీందర్ మాట్లాడుతూ.. భూపాలపల్లి నుంచి కేటీపీపీ, ఉప్పల్ బొగ్గు రవాణాకు పాత ధరలు గిట్టుబాటు కావడం లేదని తెలిపారు. నూతనంగా ప్రతి టన్నుకు రూ.110, 120, 300 పెంచాలని కోరారు. దీనిపై పది రోజుల క్రితమే కోల్ ట్రాన్స్‌పోర్టర్లకు సమ్మె నోటీసు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి ప్రభాకర్, మహేందర్, రాకేష్, నర్సయ్య, లక్ష్మయ్య, రాములు, శ్రీరాములు, నర్సింహరెడ్డి, అశోక్, తిరుపతి పాల్గొన్నారు.
రామప్ప టెంపుల్
బ్యూటిఫుల్
వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్‌గా ఉందని జర్మనీకి చెందిన డానియల్, వోలివా, సారియా కొనియాడారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప దేవాలయాన్ని వారు శనివారం సందర్శించి రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ బాగుందని కొనియాడారు. అదేవిధంగా ఇంగ్లండ్‌కు చెందిన జొనాతన్ డేవిస్ సందర్శించగా రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ ఆయనకు వివరించారు.

కాలసర్ప, శని పూజలకు భక్తుల రద్దీ