
పత్తి కొనుగోళ్లు సక్రమంగా సాగేలా చర్యలు
● మార్కెట్ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల
కాటారం: సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు సక్రమంగా సాగేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల అన్నారు. కాటారం మండల కేంద్రంలో ఏఎంసీ ఆవరణలో పత్తి విక్రయాల్లో రైతులు పాటించాల్సిన సూచనలు తెలియజేస్తూ ముద్రించిన పోస్టర్‌ను శనివారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ తిరుమల మాట్లాడుతూ ఈ నెల చివరి వారంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు పత్తి విక్రయాలకు సంబంధించి పలు సూచనలు పాటించాలని తెలిపారు. రైతులు విక్రయానికి ముందు కపాస్ కిసాన్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలని దీని ద్వారా తమ ఇష్టమైన మిల్లుకు పత్తి విక్రయించడానికి సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు. రైతులు తాము వినియోగించే ఖాతాకు ఆధార్‌లింకు చేసుకోవాలని సూచించారు. పత్తికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8110 ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. అనంతరం ఏఎంసీ కార్యాలయంలో ధన్ ధాన్య కృషి యోజన పథకం ప్రారంభోత్సవ వీడియో కాన్ఫరెన్స్‌లో చైర్‌పర్సన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి లా షరీఫ్, ఏఎంసీ డైరెక్టర్ రమేశ్, ఆత్మకూరు కుమార్‌యాదవ్, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.