
పత్తిరైతు పరేషాన్!
భూమి తేమతో..
అధిక వర్షాలతో పంట నష్టం
కాళేశ్వరం: పత్తి రైతు ఈ సారి పరేషాన్‌లో పడ్డాడు. రోజుల తరబడి కురుస్తున్న వర్షాల కారణంగా పత్తి పంట తీవ్రంగా తిన్నదని రైతులు వాపోతున్నారు. ముందుగా కాసిన కాయలన్నీ నల్లబడిపోయాయి. విచ్చుకున్న పత్తి తడిసి అందులో మొలకలు వస్తున్నాయి. వానలకు చీడ పీడలు, తెగుళ్ల ఉధృతి బాగా పెరిగింది. తెల్లదోమ, పచ్చ దోమ దాడి పెరిగిపోయింది. దీంతో మలిదశ పూత, కాతంతా రాలిపోతోంది. తెగుళ్లతో ఆకులపై నల్లని మచ్చలు, ఎర్రబారి చెట్టు కుంగిపోతోంది. మరో రెండునెలలు పచ్చగా ఉండాల్సిన చేలు పండుటాకులతో వెలవెలబోతున్నాయి. ఆకురాల్చి మొక్కలన్నీ మోడులవుతున్నాయి. రైతులు నివారణ చర్యలు చేపట్టలేకపోతున్నారు. దీంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు అంటున్నారు. అన్నారం టు కాళేశ్వరం వరకు గోదావరి ఉప్పొంగడంతో పరివాహక ప్రాంతాల్లో వరదనీరు ఇప్పుడిప్పుడే తగ్గుతుంది. ఎడతెరిపి లేని వర్షాలతో తమను నిండా ముంచాయని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తగ్గనున్న దిగుబడి..
ఈ ఏడాది జిల్లాలో 98,780 ఎకరాల్లో పత్తిసాగు చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, చీడ పీడల కారణంగా దిగుబడులు సగానికి పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు పంటను దెబ్బతీశాయి. మొదటి కాసిన కాయలన్నీ నల్లబడ్డాయి. విచ్చుకున్న పత్తి బూజుపట్టి రంగు మారింది. మొదట్లో కాసిన కాయలే పెద్దగా ఉండి బరువు తగ్గుతాయని రైతులు అంటున్నారు. ఆకులు, ఆ కాయలన్నీ నల్లబడి నేలరాలడంతో పాటు దోమ పోటుతో రెండో దశ పూత, కాత నిలవడం లేదు. తెగుళ్లతో రెండునెలల ముందుగానే చేలన్నీ ఎండిపోతున్నాయి. పత్తిలో సాధారణంగా ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. అలాంటిది నా లుగైదు క్వింటాళ్లు రావడమే కష్టమని రైతులు అంటున్నారు. పెట్టుబడులకు అప్పులు చేసి ఖర్చు చేశామని దిగుబడులు రాకపోతే ఏం చేయాలని ఆందోళన చెందుతున్నారు.
నల్లబారి రాలిపోతున్న పూత, కాత
విజృంభిస్తున్న తెగుళ్లు
దిగుబడులపై ప్రభావం
ఆందోళనలో రైతాంగం
పత్తి ఆరుతడి పంట అడపాదడపా వర్షాలు కురిస్తే పత్తిచేలు ఆరోగ్యంగా ఎదిగి, ఆశించిన దిగు బడిని వస్తుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. జూన్, జూలై నెలల్లో తీవ్ర వర్షాభావం ఉండగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మొదటి వారం వరకు ప్రస్తుతం వర్షాలు దంచి భూమిలో అధిక తేమతో పత్తి పంటకు వేరుకుళ్లు, పారవిల్డ్ లాంటి తెగులు సోకి వేరు వ్యవస్థ దెబ్బతిని ఎదుగుదల నిలిచిపోయింది. బురదమయంగా ఉన్న చేలల్లో సూక్ష్మదాతు లోపం కనిపిస్తోంది. మెగ్నీ షియం, జింకు, బోరాన్ లోపం వల్ల పంట దెబ్బతింటోంది. రైతులు వర్షం భయంతో ఎరువులు వేయడం లేదు. పురుగు మందులు పిచికారి చేయలేకపోతున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి వంట చేతికొచ్చే సమయంలో దెబ్బతింటుండటంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.

పత్తిరైతు పరేషాన్!