
ఇంకా మహదేవపూర్ కేంద్రంగానే..
పలిమెల మండలం ఏర్పడి నేటికి పదేళ్లు
పలిమెల: పలిమెల మండలం ఏర్పడి నేటికి పదేళ్లు అవుతున్నా మండలంలోని ప్రజలకు మాత్రం మెరుగైన పాలన ఇంకా అందడం లేదు. నేటికీ మండల కేంద్రంలో ఒక పోలీస్‌స్టేషన్ మినహా ఏ ఇతర కార్యాలయాలు లేవు. చిన్న మండలాలతో ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించాలనే ప్రభుత్వ ఉద్దేశంతో మహదేవపూర్ మండలంలో ఉన్న పలిమెలను ఎనిమిది గ్రామపంచాయతీలతో కలిపి మండలంగా చేశారు. మండల ఏర్పాటు తొలి రోజుల్లో సంతోషించిన ప్రజలు సేవలు అందక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అప్పటి కలెక్టర్ ప్రత్యేక చొరవ..
అక్టోబర్ 11, 2016లో పలిమెల మండలం ఏర్పాటైంది. అప్పటి కలెక్టర్ ఆకునూరి మురళి ప్రత్యేక చొరవతో మండల కార్యాలయాలు అన్నీ ఒకే చోట ఉండేలా మండల కార్యాలయాల సమీకృత భవనాన్ని నిర్మించారు. కానీ సెక్యూరిటీ, ఇంటర్నెట్ సౌకర్యాలు లేవనే కారణంగా చూపి అధికారులు మహదేవపూర్‌లోనే తిష్ట వేస్తున్నారు.
తనిఖీలు ఉంటేనే..
కలెక్టర్, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, మంత్రుల, ఎమ్మెల్యేలు ఎప్పుడైనా మండల పర్యటనకు వస్తే తప్పా అధికారులు కనిపించని పరిస్థితి ఉంది. దీంతో అసలు మండలానికి చెందిన అధికారులు ఎవరో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. అధికారాన్ని అనుభవిస్తున్నారే తప్పా ప్రజలకు మాత్రం ఉపయోగపడటం లేదని ప్రజలు బాహాటంగా అనుకుంటున్నారు.
ఏం కావాలన్నా మహదేవపూర్‌కు..
విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులకు కావాల్సిన రెవెన్యూ సేవలు(సర్టిఫికెట్లు), వ్యవసాయ శాఖ సేవలు, మండల పరిషత్‌కు సంబంధించిన సేవలు, తదితర సేవలకు ప్రజలు పాత మండల కేంద్రమైన మహదేవపూర్‌కు పరుగులు పెట్టాల్సిందే. ముకునూరు నుంచి మహదేవపూర్ వెళ్లాలంటే సుమారు 60 కిలో మీటర్లు ప్రయాణించాలి. తీరా అక్కడికి వెళ్లాక అధికారులు ఉంటారో ఉండరో తెలియని పరిస్థితి ఉంది. కులం సర్టిఫికెట్ కావాలంటే రూ.50లతో అయ్యే పనికి చార్జీలతో కలిపి రూ.500 కావాల్సిందే. అదే కార్యాలయాలు ఇక్కడే కొనసాగితే సులభంగా పనులు అవుతాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.
చుట్టుపు చూపుగా వచ్చిపోతున్న అధికారులు
మెరుగైన పాలన అందని దుస్థితి
ఇబ్బందులు పడుతున్న ప్రజలు

ఇంకా మహదేవపూర్ కేంద్రంగానే..