
నిర్దేశిత వ్యవధిలో సమాచారం అందించాలి
భూపాలపల్లి అర్బన్: సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరిన సమాచారాన్ని నిర్దేశిత వ్యవధిలోగా అందించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘సమాచార హక్కు చట్టం–2005’ వారోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించడం ప్రతి అధికారి బాధ్యతగా భావించాలని సూచించారు. స్వచ్ఛందంగా ఇవ్వాల్సిన సమాచారాన్ని పౌరులకు సులభంగా అందుబాటులో ఉంచే విధంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. అంతకుముందు ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బందితో సమాచార హక్కు చట్టాన్ని గౌరవిస్తూ పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో అందిస్తానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, ఎస్‌డీసీ రమేష్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
విద్యార్థులు చేసే పనిలో నిబద్ధతగా ఉంటూ, నైపుణ్యం పెంపొందించుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. జిల్లా కేంద్రంలోని అధునాతన సాంకేతిక కేంద్రం (ఏటీసీ)ను కలెక్టర్ రాహుల్‌శర్మ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ల్యాబ్‌లు, పరికరాలను పరిశీలించి వాటి పని విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అధునాతన పరికరాలు ఏర్పాటు చేసినందున వాటిని సమర్థంగా ఉపయోగించి నైపుణ్యం సాధించాలని విద్యార్థులకు సూచించారు. తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. క్రమం తప్పక కళాశాలకు హాజరు కావాలని, ఎంపిక చేసుకున్న కోర్సుల్లో చక్కటి నైపుణ్యం సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూమ్లానాయక్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ