
చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు
గణపురం: గ్రామాలలో పోషణ లోపంతో బాధ పడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమిబసు సూచించారు. మండలంలోని బుర్రకాయల గూడెం అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి గురువారం పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రం పరిశీలనకు వచ్చిన ఆమెకు చిన్నారులు పూలతో స్వాగతం చెప్పగా వారిని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం పోషణలోపంతో బాధపడుతున్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 140 మంది చిన్నారులు పోషణ లోపంతో బాధపడుతున్నారని.. వారికి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన పోషక ఆహారాన్ని అందించాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న బాలామృతం, కిషోర బాలికలకు అందిస్తున్న పల్లి, మిల్లెట్ చిక్కీల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మొత్తం 8,550 మంది కిషోర బాలికలకు పల్లి, మిల్లెట్ చిక్కీలు అందిస్తున్నట్లు అధికారులు తెలపగా.. సంతృప్తి వ్యక్తంచేశారు. అంగన్‌వాడీ కేంద్రం నిర్వహణ బాగుందని సిబ్బందిని అభినందించారు. అనంతరం పోషణ మాసంలో భాగంగా గర్భిణులకు సీమంతాలు చేశారు. గర్భిణులు ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలని క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేపించుకుంటూ వైద్యుల సలహాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా వైద్యాధికారి మధుసూదన్, సీపీఓ బాబురావు తదితరులు పాల్గొన్నారు.
పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి
భూపాలపల్లి: పంట మార్పిడి విధానం ద్వారా అధిక దిగుబడి సాధనకు రైతులకు అవగాహన కల్పించాలని నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు సూచించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో ఆకాంక్షిత జిల్లాలో అభివృద్ధి సూచికలపై వైద్య, విద్య, మహిళా, శిశు సంక్షేమం, డీఆర్‌డీఏ, పశు సంవర్థక శాఖల అంశాలపై సమగ్ర సమీక్ష జరిపారు. కలెక్టర్ రాహుల్ శర్మ సమావేశంలో పా ల్గొని వివిధ రంగాల్లో జరుగుతున్న కార్యక్రమాల పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా పౌసమి బసు మాట్లాడుతూ.. వైద్య, విద్యా రంగాల్లో గుణాత్మక మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వైద్యులు సేవా దృక్పథంతో పనిచేయాలి
రేగొండ: ప్రజలకు సేవ చేయడం కోసం ఉన్నామనే దృక్పథంతో వైద్యులు పని చేయాలని నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు అన్నారు. గురువారం భూపాలపల్లి కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఓపీ రిజిస్టర్, మందుల నిల్వలు, గర్భిణులకు అందుతున్న సేవలు, ఆస్పత్రి నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మాయంక్ సింగ్, జిల్లా వైద్యాధికారి మధుసూదన్, సీపీఓ బాబురావు, ఉప వైద్యాధికారులు శ్రీదేవి, ఉమాదేవి పాల్గొన్నారు.
నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు
బుర్రకాయల గూడెంలో
అంగన్‌వాడీ కేంద్రం పరిశీలన

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు