
గిరిజనులు రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: గిరిజనులు వందశాతం రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలని ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పూనెం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని మేడారంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా షెడ్యూల్డ్ తెగల హోదా అనుభవిస్తున్న బంజారాలను తొలగించే వరకు దీర్ఘకాలిక ఉద్యమాలను కొనసాగిస్తామన్నారు. 1976లో రాజ్యాంగానికి విరుద్ధంగా గుర్తించబడిన లంబాడీ తెగ విద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ, రాజకీయ రంగాలలో అత్యధికంగా రిజర్వేషన్లు అనుభవిస్తుందని తెలిపారు. దీంతో ఆదిమ లక్షణాలున్న తొమ్మిది తెగలు నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సమ్మక్క– సారలమ్మ జాతర అభివృద్ధి ముసుగులో ఆదివాసీల సంస్కృతీ, సంప్రదాయాలకు విఘాతం కలిగించే విధంగా ప్రయత్నం చేస్తుందని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సమ్మక్క– సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ లోగోలో లంబాడీల భాషా పదాన్ని తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 19న ఆదిలాబాద్‌లో అన్ని ఆదివాసీ ప్రజా సంఘాలతో సమావేశం నిర్వహించి ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్తామని వివరించారు. ఈ సమావేశంలో జేఏసీ వర్కింగ్ కమిటీ చైర్మన్ వట్టం ఉపేందర్, వైస్ చైర్మన్ రవి, జేఏసీ బాధ్యులు వాసం రామకృష్ణ, నరసింహమూర్తి, రాంచందర్, మడి సాయిబాబు, రవి, సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన సురేందర్, తుడుందెబ్బ నాయకులు కబ్బాక శ్రావణ్ కుమార్, చింత కృష్ణ, వట్టం జనార్ధన్, చందా మహేశ్ పాల్గొన్నారు.