
కనీస మద్దతు ధరకు పత్తి కొనుగోలు
భూపాలపల్లి: పత్తిని కనీస మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ ఆదేశించారు. బుధవారం వివిధ శాఖల అధికారులతో కలిసి పత్తి కొనుగోలు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. 2025–26లో జిల్లాలో 98,260 ఎకరాల్లో పత్తి సాగు జరిగిందని, 11,79,000 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. అక్టోబర్ మాసం తర్వాత పత్తి దిగుబడి ప్రారంభమవుతుందని, నవంబర్, డిసెంబర్ నెలల్లో అధికంగా విక్రయానికి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే తక్కువగా మార్కెట్‌లో రేటు పలికితే వెంటనే సీసీఐ కేంద్రాల ద్వారా మద్దతు ధర కల్పించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేసేందుకు భూపాలపల్లి, కాటారం, చిట్యాల మార్కెట్ పరిధిలో మొత్తం 5 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పత్తి తేమ శాతం 8 శాతం ఉన్నప్పుడు కనీస మద్దతు ధర రూ. 8,110 గా ఉందన్నారు. రైతులకు స్లాట్ బుకింగ్ తప్పనిసరని అదనపు కలెక్టర్ వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ నరేష్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్