
బాకీ కార్డుతో కాంగ్రెస్‌కు భయం
● మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి అర్బన్: ప్రజలకు ఇచ్చిన హామీల బాకీ కార్డుతో కాంగ్రెస్ పార్టీకి భయం పుట్టిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాధారణ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు, 420 హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేటికి 660 రోజులు పూర్తయిందన్నారు. ఇచ్చిన వాగ్ధానాలను ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. హమీలను గుర్తు చేయాలని ఇంటింటికీ వెళ్లి ప్రజలను చైతన్యం చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉండగా చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసన్నారు. వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ ధోకా చేస్తే భూపాలపల్లి కుగ్రామం నుంచి నేడు జిల్లా స్థాయికి ఎలా అభివృద్ధి చెందిందన్నారు. మారుమూల జిల్లాకు మెడికల్ కళాశాల వచ్చిందని గుర్తు చేశారు. కనీసం రైతులకు యూరియా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం, ముఖ్యమంత్రి అని ప్రజలు మండిపడుతున్నట్లు తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో తమకు ప్రశ్నించే హక్కు ఉందని.. దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు గుర్తుచేశారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్‌కుమార్, నాయకులు సిద్దు, జనార్దన్, రాజు, రవికుమార్, అశోక్ పాల్గొన్నారు.