
ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరగాలి
కాటారం: స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సక్రమంగా జరిగేలా లోటుపాట్లు లేకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కాటారం మండలకేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూంలు, ఓట్లు లెక్కింపు కేంద్రాలను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. విద్యుత్, స్ట్రాంగ్ రూంల భద్రత, సీసీ కెమెరాలు, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు. ఓట్ల లెక్కింపు గదుల్లో విద్యుత్ సౌకర్యం, లైటింగ్, భద్రత వంటి అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఎంపీడీఓలు అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సౌకర్యాల కల్పనపై ధృవీకరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులకు ర్యాంపు, మూడు చక్రాల సైకిళ్లు అందుబాటులో ఉంచేలా చూసుకోవాలన్నారు. జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి మల్లీశ్వరీ నోడల్ ఆఫీసర్‌గా ఉంటారని తెలిపారు. అనంతరం ఏటీసీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన పరికరాలు అమర్చకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. పరికరాల ఏర్పాటు విషయం తన దృష్టికి తీసుకురాకపోవడం పట్ల కలెక్టర్ ప్రిన్సిపాల్ భిక్షపతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వీడి విద్యార్థులకు సాంకేతిక విద్య సక్రమంగా అందేలా చూడాలని సూచించారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు ఉన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ