
ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోకి పాడిగేదెలు
భూపాలపల్లి: ఎమ్మెల్యే చెప్పినందుకే షెడ్డు కూలగొడుతున్నామని మున్సిపల్ అధికారులు తెలిపారంటూ.. ఏకంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి పాడిగేదెలను పంపి బాధితులు నిరసన తెలిపారు. ఈ ఘటన భూపాలపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భూపాలపల్లి పట్టణంలోని మంజూర్‌నగర్ కాలనీ సింగరేణి ఏరియా ఆస్పత్రి పక్కన గల స్థలంలో కూరాకుల ఓదెలు, లలిత దంపతులు గత 30 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. పాడిగేదెలు(బర్రెలు)ను సాకుతూ పాల వ్యాపారం చేసుకుంటున్నారు. రహదారిని ఆక్రమించుకొని షెడ్డు ఏర్పాటు చేసుకున్నారని, దానిని తొలగించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని నెలన్నర క్రితం రమేష్ అనే వ్యక్తి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నెల రోజుల క్రితం ఓదెలుకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అతడినుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్ ఆదేశాల మేరకు టీపీఓ సునిల్‌కుమార్ గురువారం జేసీబీ సాయంతో ఓదెలు షెడ్డును కూల్చివేయించాడు. దీంతో బాధిత దంపతులు సాయంత్రం తమ పాడిగేదెలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలోకి పంపారు. తమ షెడ్డు కూల్చివేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చెప్పినట్లుగా మున్సిపల్ అధికారులు తెలిపారని, అందుకే ఎమ్మెల్యే కార్యాలయ ఆవరణలోకి గేదెలను పంపి నిరసన తెలుపుతున్నామని వెల్లడించారు. తమకు న్యాయం జరిగే వరకు గేదెలు, మేము ఇక్కడే ఉంటామని భీష్మించుకొని కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్యాంపు కార్యాలయానికి చేరుకోగా ఓదెలు క్రిమిసంహారక మందు తాగేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం గేదెలను బయటకు పంపి ఓదెలు, లలితను అదుపులోకి తీసుకొని మాట్లాడి ఇంటికి పంపించారు.
తమ షెడ్డు కూల్చారని బాధితుల నిరసన

ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోకి పాడిగేదెలు