
విద్యార్థులను పట్టించుకోని ప్రభుత్వం
మొగుళ్లపల్లి: రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు, విద్యార్థులను పట్టించుకోవడం లేదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతిబాపు బాలుర గురుకుల విద్యాలయంతోపాటు కొర్కిశాలలోని కేజీబీవీని వరంగల్ మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి సందర్శించారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిష్టర్లను పరిశీలించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎంజేపీ గురుకులంలో కరెంట్, నీటి సమస్య తీవ్రంగా ఉందని, కేజీబీవీలో మెనూ ప్రకారం భోజనం పెట్టడంలేదని విద్యార్థులు వారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి ఎంజేపీ గురుకులానికి మిషన్ భగీరథ నీటిని సరిపడా సరఫరా చేయాలని ఏఈతో ఫోన్లో మాట్లాడారు. కరెంట్ తీగలు వేలాడుతున్నాయని, స్వీచ్‌బోర్డులు సరిగా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ క్రమంలో కుళ్లిన కూరగాయలను చూసి ఇలాంటి కూరగాయలతో భోజనం పెడితే ఫుడ్ పాయిజన్ అవుతుందని ప్రిన్సిపాల్ శారదపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆయన సూచించారు. గురుకులానికి పర్మనెంట్ ఎలక్ట్రీషయన్, వెల్డర్లను నియమించాలని సూచించారు. అదేవిధంగా నీటి సమస్య తీర్చడం కోసం బోర్లు వేయించాల్సిన అవసరం ఉందని, కరెంట్ తరచూ పోతున్న కారణంగా సోలార్‌లైట్స్, సోలార్ వాటర్ హీటర్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. పాఠశాలలు ప్రారంభమై రెండునెలలు కావస్తున్నా ఇప్పటివరకు విద్యార్థులకు యూనిఫా మ్ దుస్తులు అందించకపోవడం బాధాకరమని అన్నారు. గురుకులాల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు బల్గూరి తిరుపతిరావు, జోరుక సదయ్య, కొడారి రమేష్, రవి, దేవునూరి కుమార్, గడ్డం రాజు, తదితరులు ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి