జనగామ రూరల్: చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న మున్సిపల్ పరిధిలోని ఇళ్లను బుధవారం మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జనగామ పట్టణ పరిధిలో చేయూత పింఛన్‌లకు 1,030 దరఖాస్తులు రాగా ప్రభుత్వం నిర్దేశించిన నిబ ంధనలకు మేరకు క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 150కి పైగా దరఖాస్తుదారుల క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేశామన్నారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో చర్యలుచేపడుతున్నారన్నారు.
‘ప్రజాపాలన’కు
ఏర్పాట్లు పూర్తి
జనగామ: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ (సెప్టెంబర్ 17) వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో నేడు ఉదయం 8:50 గంటలకు జరిగే వేడుకలకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. 8:56 గంటలకు పోలీస్ గౌరవ వందనం అనంతరం జాతీయ గేయాలాపన (వందేమాతరం), తెలంగాణ రాష్ట్ర గీతావళి (జయ జయహే తెలంగాణ) ఆలపిస్తారు. ఉదయం 9:10 నిమిషాలకు జాతీయ పతాకా న్ని ఎగుర వేస్తారు. అనంతరం ముఖ్యఅతిథి ప్రసంగం, 9:30 నిమిషాలకు విద్యార్థులు, కళాబృందాల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సీజనల్ వ్యాధులపై
అప్రమత్తత అవసరం
పాలకుర్తి టౌన్: సీజనల్ వ్యాధులపై వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ సంధ్య, డీఎంహెచ్‌ఓ డాక్టర్ వాణీశ్రీ సూచించారు. బుధవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని వారు సందర్శించారు. ఆస్పత్రిలో మందుల నిల్వలు, ల్యాబ్, ఓపీ రికార్డులను, సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. విధుల నిర్వహణ, పారిశుద్ధ్య చర్యలపై ఆరా తీశారు. జ్వరాలు, డెంగీ, మలేరియా అనుమానిత కేసులను వెంటనే గుర్తించి పరీక్షలు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో మెడికల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, వైద్యాధికారి బండి ఉష, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


