జనగామ: ప్రభుత్వ భూముల పరిరక్షణలో జిల్లా యంత్రాంగం మరో కీలక చర్య చేపట్టింది. జిల్లాలోని చిల్పూర్ మండల కేంద్రం పరిధి సర్వే నంబర్ 229లో ఉన్న ప్రభుత్వ సీలింగ్ భూముల్లో అక్రమణకు గురైన మూడు ఎకరాల 12 గుంటల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి విలువ రూ.3.50 కోట్లకుపైగా ఉండడంతో ఈ చర్య జిల్లాలో ప్రాధాన్యం సంతరించుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వే నంబర్ 229లో మొత్తం 36 ఎకరాలకుపైగా ప్రభుత్వ సీలింగ్ భూమి ఉంది. గత రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 2019 నుంచి ఓ రెడీమిక్స్ ప్లాంట్ నిర్వహిస్తున్న సంస్థ మూడు ఎకరాల 12 గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించి వినియోగిస్తున్నట్లు విచారణలో తేలింది. భూమి ప్రభుత్వానికి చెందినదేనని పూర్తిస్థాయిలో నిర్ధారణకు వచ్చిన అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఈ నెల 20న ఆక్రమిత భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు చర్యలు చేపట్టి భూమిని స్వాధీనం చేసుకున్నారు. తరిగొప్పుల–చిన్న పెండ్యాల ప్రధాన రహదారికి ఆనుకుని ఉండటంతో ఈ భూమికి అధిక మార్కెట్ విలువ ఉందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో బచ్చన్నపేట, సాల్వాపూర్, పోచన్నపేట, బచ్చన్నపేట మండల కేంద్రం, నర్మెట, చిల్పూర్ తదితర ప్రాంతాల్లో గతంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారుల చర్యలు


