పుట్టకముందే శిశువుకు తీర్పు..చివరికి తల్లిప్రాణం బలి
జనగామ: ఆధునిక సమాజంలోనూ లింగవివక్ష రాక్షసత్వానికి కడుపులోని పసిమొగ్గలను గర్భంలోనే తుంచేస్తున్నారు. చట్టాలు ఎన్ని ఉన్నా.. అక్రమ స్కానింగ్ సెంటర్లు, దొంగ బాబాల అండతో కడుపులోనే నూరేళ్లు నింపేస్తున్నారు. పుట్టక ముందే ఒక శిశువు భవితవ్యంపై తీసుకున్న నిర్ణయం చివరకు ఓ తల్లి ప్రాణాన్ని బలితీసుకుంది. కుటుంబ ఆశలు, సామాజిక ఒత్తిళ్లు, చట్ట వ్యతిరేక చర్యలు, నిర్లక్ష్యపు వైఖరి కలిసి మరో ఇంటిని శోకసంద్రంలోకి నెట్టాయి. ఈ ఘటన ఒక కుటుంబానికే పరిమితం కాకుండా సమాజం ముందుంచిన బాధాకర ప్రశ్నగా మారింది. జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చిన అక్రమ గర్భస్రావం ఘటన లింగ నిర్ధారణ పరీక్షలు, అక్రమ అబార్షన్ల వ్యవహారంపై తీవ్ర చర్చకు దారి తీసింది. గర్భంలో ఆడశిశువు ఉందని చెప్పిన అనంతరం గర్భస్రావం నిర్వహించి మహిళ మృతి చెందిన ఘటనతో ఈ వ్యవహారం ఒక్కసారిగా బయటపడింది. అయితే ఇది ఒక్క కేసుకే పరిమితమా లేక దీని వెనుక పెద్ద నెట్‌వర్క్ పని చేస్తోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
లింగ నిర్ధారణ నుంచి అబార్షన్ వరకు..
పోలీసుల ప్రాథమిక విచారణలో ఆర్‌ఎంపీ, అక్రమంగా లింగ నిర్ధారణ చేసిన వ్యక్తి, గర్భస్రావం నిర్వహించిన ప్రైవేట్ వైద్య సిబ్బంది పాత్ర బయటపడింది. దీంతో లింగ నిర్ధారణ పరీక్షల నుంచి గర్భస్రావాల వరకు ఒక వ్యవస్థీకృత గొలుసు పని చేస్తోందా? అనే కోణంలో దర్యాప్తు అవసరమనే అభిప్రాయం వక్తమవుతోంది. ఈ కేసులో మరెవరైనా మధ్యవర్తులు ఉన్నారా అనే అంశం కూడా విచారణలో తేలాల్సి ఉంది. ఇద్దరు కుమార్తెలు ఉన్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి గర్భస్రావాలకు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణ ఎక్కడ?
లింగనిర్ధారణ పరీక్షలు, ఆడశిశువు ఎంపిక గర్భస్రావాలు చట్టరీత్యా నిషేధం. అయినప్పటికీ ఈ ఘటన వెలుగులోకి రావడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప ర్యవేక్షణ, తనిఖీలు, అమలు వ్యవస్థ పని తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్రమ స్కానింగ్ కేంద్రాలు, అనుమానాస్పద క్లినిక్‌లపై ఎప్పటికప్పుడు త నిఖీలు జరిగాయా అనే అంశంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.
దర్యాప్తులో తేలాల్సిన కీలక ప్రశ్నలు
ఈ కేసులో గర్భస్రావానికి ఎంత మొత్తం వసూలు చేశారు, మధ్యవర్తులకు కమీషన్లు అందాయా, గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయా, ఇంకా ఎ న్ని అక్రమ స్కానింగ్ కేంద్రాలు, గర్భస్రావ కేంద్రాలు పని చేస్తున్నాయి అనే వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం వంటి ప్రశ్నలకు సమాధానాలు పోలీసుల దర్యాప్తు, సంబంధిత అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.
సమగ్ర విచారణకు పెరుగుతున్న డిమాండ్
ఈ ఘటన నేపథ్యంలో జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలు, ప్రైవేట్ క్లినిక్‌లు, అనుమానాస్పద వైద్య కార్యకలాపాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ లింగ నిర్ధారణ, గర్భస్రావాలకు పాల్పడే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హనుమకొండలో స్కానింగ్.. జనగామలో గర్భస్రావం
ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన కేసులో హనుమకొండలో అక్రమంగా లింగ నిర్ధారణ జరగగా, జనగామలోని సంజయ్‌నగర్ కాలనీకి చెందిన అనసూర్య అనే ప్రైవేట్ వైద్య సిబ్బంది ఇంట్లో గర్భస్రావం నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో జిల్లాల మధ్య సమన్వయంతో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు అవసరమని భావిస్తున్నారు. పైగా సంజయ్‌నగర్‌లోని సంబంధిత ఇంటికి తరచూ గర్భిణులు వస్తుండేవారని, కొద్ది రోజుల వ్యవధిలో అనుమానాస్పద రాకపోకలు కనిపించేవని చెబుతున్నారు.
ఆశల పేరుతో ఆరిపోయిన ఓ ఇంటి దీపం
జనగామలో అక్రమ అబార్షన్ల గుట్టురట్టు..!
వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణపై ప్రశ్నలు


